ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధమే : రాహుల్ గాంధీ
ప్రజల కోసం దెబ్బలు తినేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అలాగే, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళలను తాము రాజకీయాల కోసం వాడుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఆందోళనల వేళ రాహుల్ మీడియా సమావేశం నిర్వహించారు. గత 10 ఏళ్లలో 152 పరీక్షల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ఆయన ఆరోపించారు. దేశంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. చివరి నిమిషంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
'విద్యార్థుల విషయంలో ఏం జరుగుతోంది. పారదర్శకమైన విద్యా వ్యవస్థ కావాలని యువత కోరుతోంది. కానీ, ఈ ప్రభుత్వం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై లాఠీఛార్జ్ చేయించింది. మధ్యతరగతి కుటుంబాలకు చదువు ఆర్థిక భారంగా మారింది. విద్యపై రూ.1.4 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు కేంద్రం చెబుతోంది. కానీ, గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల పత్రాలు లీక్ అయ్యాయి. దీని వల్ల 7.5 0కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థులు ఎంత బాధపడుతున్నా.. ఈ ప్రభుత్వం లెక్కచేయట్లేదు. ఈ పేపర్ లీకేజీ ఘటనల్లో ఇప్పటివరకు శిక్షపడిన నేరస్థుల సంఖ్య సున్నా' అని రాహుల్ విమర్శించారు.
'దేశ యువతకు ఉద్యోగాలు లేవు. విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోంది. మన దేశంలో చైనా వస్తువుల సంఖ్య పెరిగింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. బ్యాంకులను బడా వ్యాపారులు లూటీ చేస్తున్నారు. ఏఐ వల్ల కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. కేంద్రం విధానాల వల్ల పేదలు, విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యార్థులంటే మనకు శత్రువులు కాదు. ఈ దేశ భవిష్యత్తు అన్న విషయం కేంద్రం గుర్తుంచుకోవాలి' అని మండిపడ్డారు.
'విద్యార్థుల ఆందోళనను మేం రాజకీయాలకు వాడుకోవట్లేదు. ప్రతిపక్ష నేతగా ప్రజల గళం వినిపించడం నా బాధ్యత. దీనిపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు కేంద్రం అవకాశం ఇవ్వట్లేదు. అందుకే విద్యార్థులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చాం. నిన్న నిరసనల్లో నా పట్ల జరిగిన దానికి బాధపడటం లేదు. విద్యార్థులకు జరుగుతోన్న నష్టం విషయంలోనే బాధగా ఉంది. పరీక్షల విధానంలో మార్పులు రావాలి. ప్రజల కోసం ఎన్ని దెబ్బలు తినేందుకైనా నేను సిద్ధం' అని కాంగ్రెస్ ఎంపీ తెలిపారు.
