శుక్రవారం, 23 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 డిశెంబరు 2025 (19:53 IST)

మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారును గద్దె దించుతాం : రాహుల్ గాంధీ శపథం

rahul gandhi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని సత్యమనే ఆయుధంతో గద్దె దించితీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శపథం చేశారు. పైపెచ్చు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆయన మరోమారు ఆరోపించారు. ఈ ఓట్ల చోరీని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిప కేంద్ర ఎన్నికల సంఘం చేస్తోందన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో రాహుల్ గాంధీతో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. 
 
ఇందులో రాహుల్ ప్రసంగిస్తూ, 'తాము దేశం కోసం పనిచేస్తున్నామని, మోడీ కోసం కాదనేది ఎన్నికల సంఘం గుర్తుంచుకోవాలి. బీహార్‌ ఎన్నికల వేళ భాజపా రూ.10 వేల చొప్పున పంచినా.. ఈసీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు.. ఎన్నికల సంఘంపై ఎటువంటి చర్యలకు అవకాశం లేకుండా కేంద్రం ఓ చట్టం తీసుకొచ్చింది. మేం అధికారంలోకి వస్తే దాన్ని మార్చి.. ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటాం. సమయం పట్టినా.. చివరకు సత్యమే గెలుస్తుంది. మోడీ, అమిత్‌ షాలను ఓడించేందుకు.. సత్యం, అహింస మార్గంలో పోరాడతాం' అని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. 
 
ఇదే బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రసంగిస్తూ, దేశంలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించడం లేదని, అడుగడుగునా అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. బీహార్‌ ఎన్నికల సమయంలో రూ.10 వేలు ఇవ్వడాన్ని ఈసీ పట్టించుకోలేదని, ఇది ఓటు చోరీ కాదా? అని ప్రశ్నించారు. బీహార్‌లో ఓడిపోయినందుకు నిరుత్సాహపడకూడదని, ఓట్ల చోరీ ద్వారా భాజపా గెలిచిందని దేశం మొత్తానికి తెలుసన్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటూ భాజపాకు సవాల్‌ విసిరారు.