పారిశుద్ధ్య మహిళా కార్మికురాలి నిజాయితీకి బంగారు బహుమతి
చెన్నై నగరంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీకి బంగారు బహుమతి లభించింది. ఈ బహుమతి ప్రదానం చేసిందో ఎవరో కాదు.. సాక్షాత్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ మహిళా కార్మికురాలిని తన కుటుంబ సభ్యులతో తన ఇంటికి ఆహ్వానించిన రజనీకాంత్, ఆ మహిళా కార్మికురాలికి బంగారు గొలుసును బహుకరించారు. దీంతో ఆ మహిళ ఆనంద భాష్పాలురాల్చారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంగళవారం జరిగిన ఈ అరుదైన సంఘటన వివరాలను పరిశీలిస్తే,
చెన్నైకి చెందిన పద్మ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో టీ నగరులోని విధుల్లో ఉండగా, ఆమెకు ఓ పర్సు దొరికింది. దాన్ని తెరిచి చూడగా, అందులో 45 సవర్ల (తులాల) బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఏమాత్రం ఆశపడని పద్మ, వెంటనే తన పై అధికారులకు సమాచారం అందించి, ఆ బంగారాన్ని పాండీ బజార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరిపి, ఆ ఆభరణాలను అసలు యజమానులకు అందజేశారు.
పద్మ నిజాయతీ గురించి తెలిసి పలువురు ఆమెను ప్రశంసించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్వయంగా ఆమెను అభినందించి, లక్ష రూపాయల చెక్కును బహుమతిగా అందించారు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, మంగళవారం పద్మను తన నివాసానికి ఆహ్వానించారు. ఆమె నిజాయతీని ప్రశంసించి, ఓ బంగారు గొలుసును బహూకరించారు. దీంతో ఆమె ఉబ్బితబ్బిబ్బులైపోయారు.
కాగా, ఇటీవల పేదలకు కేవలం ఐదు రూపాయలకే పరోటాలు అమ్ముతున్న మదురైకు చెందిన తన వీరాభిమాని రజనీ శేఖర్‌ను కూడా రజనీకాంత్ కొన్ని రోజుల క్రితం ఇలాగే బంగారు గొలుసుతో సత్కరించిన విషయం తెలిసిందే.