భోపాల్‌లో 'శుభలగ్నం' మూవీ రిపీట్ - రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లోని శుభలగ్నం సినిమా రిపీట్ అయింది. కట్టుకున్న భర్తను ఓ భార్య రూ.1.5 కోట్లకు అమ్మేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ ప్రాంతంలో 42 యేళ్ల వ్యక్తి 52 యేళ్ళ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య... భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా, ఆ వ్యక్తి భార్య కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే భార్యతో కలిసి వుండేందుకు భర్త అంగీకరించలేదు.
ఈ క్రమంలో తన భర్తను వదిలేసేందుకు రూ.1.5 కోట్లు, అదనంగా మరో రూ.27 లక్షలు, ఇల్లు ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. దీనికి భర్త అంగీకరించారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఒప్పందం కోర్టు సమక్షంలో జరిగింది. ఈ విషయాన్ని కోర్టు అధికారికంగా ప్రకటించింది. ఈ డబ్బు మొత్తాన్ని ఆ వ్యక్తి ప్రియురాలు చెల్లించడం గమనార్హం.
రెండో పెళ్లి చేసుకున్న భార్య.. చంపేసిన మాజీ భర్త
హైదరాబాద్ నగరంలోని వనస్థలి పురంలో ఓ మహిళను ఆమె మాజీ భర్త చంపేశాడు. తనను కాదని రెండో వివాహం చేసుకున్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెను చంపేందుకు కట్టర్, పెట్రోల్‌తో ఆమె ఉన్న ఇంటికే వచ్చి హత్య చేశాడు. మృతురాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అలాగే, భర్త మహేశ్ ఆస్ట్రేలియాలో ప్రవాసభారతీయుడుగా ఉంటున్నారు.
కుటుంబ తగాదాల కారణంగా సునీత ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత భర్త మహేశ్‌కు విడాకులు ఇచ్చి పది నెలల క్రితం శ్రీనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ స్వదేశానికి తిరిగివచ్చి సునీత ఉంటున్న ఇంటికి వెళ్లి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి రెండో భర్త శ్రీనాథ్ నుంచి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. సునీత ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు.