సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం
ఆ ఇద్దరు నాయకులు హేమాహేమీలే. కర్నాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ విజయానికి మూలకారకులు డీకె శివకుమార్ అని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆయనకే సీఎం పదవి ఇస్తారని కూడా అనుకున్నారు. ఐతే సిద్ధరామయ్య మాత్రం తన పట్టుతో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆ సమయంలోనే ఓ ఒప్పందం జరిగిందట. ఇద్దరు నేతలను కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి ఐదేళ్ల పాలనా కాలంలో సిద్దరామయ్య రెండున్నరేళ్లు, డీకె శివకుమార్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా వుంటారని రహస్య ఒప్పందం కుదిర్చారట. ఐతే అనుకున్నదానికంటే ఆరు నెలలు పాటు సిద్ధూ సీఎం కుర్చీని వదల్లేదు. ఇది కాస్తా హైకమాండుకి తలనొప్పి తెప్పించింది. ఎట్టకేలకు ఇవాళ సిద్ధరామయ్య ఇంట్లో అల్పాహార విందు తర్వాత మీటింగులో తను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు.
సిద్ధరామయ్య స్థానంలో ప్రస్తుత ఉపముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని రాజ్‌భవన్‌లోని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికి సమర్పించారు. ఈ సీఎం మార్పుకి గల కారణాలు ఏమిటన్నది ఒకసారి చూస్తే... 2023 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి కోసం గట్టిగా పోటీ పడ్డారు. ఆ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్.. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య ఒక రహస్య ఒప్పందాన్ని కుదిర్చినట్లు సమాచారం. దీని ప్రకారం ఐదేళ్ల పదవీకాలంలో సిద్ధరామయ్య మొదటి సగం కాలం (దాదాపు 3 ఏళ్లు) సీఎంగా ఉంటారని, ఆ తర్వాత మిగిలిన కాలానికి డి.కె. శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని అప్పట్లోనే నిర్ణయించారు. ఇప్పుడు ఆ సమయం ముగియడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య తప్పుకున్నారు.
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అగ్రనేతలు సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్‌లతో వరుసగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హైకమాండ్ స్పష్టం చేసింది. దాంతో అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ సిద్ధరామయ్య 48 గంటల్లోనే రాజీనామా చేయడానికి అంగీకరించారు.
సిద్ధరామయ్యను ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఆయనకు రాజ్యసభ సీటుతో పాటు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే సిద్ధరామయ్య తాజా ప్రెస్ మీట్‌లో రాజ్యసభ ఆఫర్‌ను తాను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన సేవలను పార్టీ జాతీయ స్థాయిలో ఎలా ఉపయోగించుకుంటుందనేది చూడాలి.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో డి.కె. శివకుమార్ కీలక పాత్ర పోషించారు. పార్టీకి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అండగా నిలిచే 'ట్రబుల్ షూటర్'గా ఆయనకు పేరుంది. చాలా కాలంగా సీఎం పదవి కోసం నిరీక్షిస్తున్న ఆయనకు, ఈ మార్పు ద్వారా అధిష్టానం న్యాయం చేసింది.
