సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఫిబ్రవరి 2026 (20:06 IST)

సర్‌కు ఆటంకాలు కల్పించవద్దు : బెంగాల్ సర్కారు సుప్రీం హెచ్చరిక

supreme court
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ - సర్‌కు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రస్తుతం సర్ ప్రక్రియ బెంగాల్ రాష్ట్రంలో కొనసాగుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 
 
సర్ పక్రియలో ఏవైనా ఆదేశాలు, స్పష్టత అవసరమైతేనే తాము కల్పించుకుంటామని పేర్కొంది. అంతేకానీ, సర్ ప్రక్రియలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ  విషయాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అర్థం చేసుకోవాలని సూచించింది. 
 
కాగా, సర్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు 300 మంది అధికారులను కేటాయించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరితే కేవలం 80 మంది గ్రేడ్-2 అధికారులను కేటాయించి చేతులు దులుపుకుందని కోర్టుకు ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. 
 
మరోవైపు, బెంగాల్ ప్రభుత్వం కూడా ఈసీకి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేసింది. ఎన్నికల సంఘం అధికారులు తమ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, అర్హులైన ప్రజలను ఓటర్ల జాబితాలో చేర్చడం లేదని బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది. ఇంటి పేర్లలో అక్షర దోషాలు, వివాహం తర్వాత మహిళల చిరునామాలో మార్పు వంటి చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, దీనివల్ల 1.36 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని ధర్మాసనానికి తెలిపింది. 
 
పైగా, స్థానికతను నిరూపించుకోవడానికి ఈసీ అధికారులు ఒక్క రోజు కూడా అవకాశం ఇవ్వలేదని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం రాష్ట్రంలో ఓటర్ల దరఖాస్తులు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి ప్రస్తుతం ఉన్న గడువును మరో వారం రోజుల పాటు పొడగించింది.