పంచుకుంటూ పోతే మిగిలేది శూన్యం : ఉచిత విద్యుత్ పథకం ప్రతిపాదనపై సుప్రీంకోర్టు
దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభాల కోసం అమలు చేస్తున్న ఉచిత పథకాలపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖజానాలోని నిధులను పంచుకుంటూ పోతే మిగిలేది శూన్యమని గుర్తు చేసింది. అసలు ఎన్నికలకు ముందు ఉచిత పథకాలను ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించింది.
దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ తరహా విధానాలపై పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే ఉచిత విద్యుత్ ప్రతిపాదనపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. ఇందుకోసం 2024 ఎలక్ట్రిసిటీ అమెండ్‌మెంట్ రూల్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
'చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచిత పథకాల పంపిణీ కొనసాగుతోంది. ఇలాంటి పథకాలతో రాష్ట్రాలతో పాటు దేశాభివృద్ధికి విఘాతం కలుగుతోంది. ఆహారం, విద్యుత్.. ఇలా అన్నీ ఉచితంగా ఇస్తూ పోతుంటే మనం ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నాం? సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే స్థోమత లేనివారికి ఉచిత విద్యుత్ అందిస్తారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని చెబుతున్నారు. ఇది బుజ్జగింపు రాజకీయ విధానం కాదా?' అని ధర్మాసనం ప్రశ్నించింది.
విద్యుత్ టారిఫ్‌లను నోటిఫై చేసిన తర్వాత ఉన్నట్టుండి ఉచిత విద్యుత్‌పై ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీజేఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందే రాష్ట్రాలు ఇలాంటి పథకాలు ఎందుకు తీసుకొస్తున్నాయని ఆగ్రహించింది. ఇలా ఎన్నికల సమయంలో అన్నీ ఉచితంగా పంచుకుంటూపోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా మిగలదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొంది. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌కు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ పిటిషన్‌పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.