మా దేశ గోప్యతతో ఆడుకోలేరు .. మెటాకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేం అనుమతించం. ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే భారత్‌ను వీడి వెళ్లొచ్చు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. 2021లో వాట్సాప్ గోప్యతా విధానానికి సంబంధించిన ఓ పిటిషన్‌పై జరిగిన విచారణ సందర్భంగా ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సప్ వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని.. ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. మెటాను హెచ్చరించారు. కొన్నిసార్లు మెటా విధానాలను అర్థం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బందిపడతామన్నారు. ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే.. దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్‌లో కనిపించాయన్నారు. ఇక దేశంలోని లక్షలాదిమంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు.
2021 జనవరిలో వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. యూజర్లు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకొనేందుకు అనుమతి లభిస్తుంది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని తొలుత హెచ్చరించింది. కానీ, దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమైంది.
ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అభ్యంతరాలు వచ్చాయి. దీనిపై జోక్యం చేసుకొన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ చట్టంలోని నిబంధనలకు ఈ కొత్త పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ పాలసీపై దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.