తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : సీఎం స్టాలిన్‌ను ఓడించిన టీవీకే తెలుగు నేత
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అధికార డీఎంకేకు ఏమాత్రం మింగుడపడలేదు. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏకంగా ఓడిపోయారు. ఆయనను విజయ్‌కు చెందిన టీవీకే తరపున పోటీ చేసిన తెలుగు నేత వీఎస్ బాబు ఘన విజయం సాధించారు.
ఎంకే స్టాలిన్ గత మూడు దఫాలుగా చెన్నై కొళత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా గత 2011 నుంచి ఆయన ఈ స్థానంలో పోటీ చేస్తూ ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన ఈ స్థానాన్నే ఎంచుకుని పోటీ చేశారు. తాజా ఎన్నికల్లోనూ గెలుపు తథ్యమనుకున్నారు. కానీ అనూహ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ పార్టీ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో పరాజయం పాలయ్యారు.
వీఎస్ బాబు సుదీర్ఘకాలంగా డీఎంకేలో ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు పురసైవాక్కం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2011 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పునర్ విభజనలో రద్దయ్యింది. అదే సమయంలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్న కొళత్తూరులో స్టాలిన్ పోటీచేశారు. విజయం సాధించారు.
అయితే మెజార్టీ తక్కువ వచ్చిందని బాబును ప్రశ్నించారు. దీంతో బాబు అన్నాడీఎంకేలో చేరారు. అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో స్టాలిన్‌పై పోటీచేసి విజయం సాధించడంతో తమిళనాడు రాజకీయరంగంలో సంచలనంగా మారారు. కొన్ని సంవత్సరాల కిందట తనను నిలదీసిన పార్టీ నాయకత్వాన్నే ఓడించడం విశేషం.
