దక్షిణాది రాష్ట్రాల్లోనే నెం. 1 అప్పుల కుప్ప TN కుర్చీపై కూర్చుంటున్న TVK విజయ్, గుదిబండలా సంక్షేమ పథకాలు
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఆ పథకాలు, వాటి వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాము. ఆర్థిక భారాన్ని పెంచే ప్రధాన పథకాలలో ఉచిత గ్యాస్ సిలిండర్లు (Annapoorani Super Six) వుంది. ఈ పథకం ప్రకారం ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని విజయ్ ప్రకటించారు. తమిళనాడులో కోట్ల సంఖ్యలో ఉన్న రేషన్ కార్డుదారులకు ఇది వర్తింపజేస్తే, ప్రభుత్వ ఖజానాపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.
భారీ వ్యవసాయ రుణాల మాఫీ రెండోది. దీని ప్రకారం 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు సంపూర్ణ రుణ మాఫీ, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి 50% మాఫీ చేస్తామన్న వాగ్దానం ఆర్థికంగా చాలా సమస్యతో కూడుకున్నది. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారుతుంది. ఇక మూడోది నిరుద్యోగ భృతి. గ్రాడ్యుయేట్లకు నెలకు ₹4,000, డిప్లొమా చేసిన వారికి ₹2,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఇది ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచుతుంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టేస్తుంది.
బంగారం, నగదు బహుమతులు కూడా వున్నాయి. అన్నన్ శీర్ తిట్టం కింద పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, పట్టుచీర, నవజాత శిశువులకు బంగారు ఉంగరం వంటి పథకాలు ప్రజల్లో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అమలులో భారీ నిధులు అవసరమవుతాయి.
ఎందుకు ఇవి 'గుదిబండ'గా మారవచ్చు?
నానాటికీ పెరుగుతున్న అప్పు, తమిళనాడు ఇప్పటికే దాదాపు ₹9.5 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఇటువంటి సమయంలో ఆదాయాన్ని పెంచే మార్గాల కంటే, ఉచిత పథకాలపై ఎక్కువ ఖర్చు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలో పడేయవచ్చు. మరోవైపు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల వడ్డీలకే పోతుంటే, కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుండి వస్తాయనేది పెద్ద ప్రశ్న.
మ్యానిఫెస్టోలో పన్ను మినహాయింపులు.. అంటే విద్యుత్ పన్ను మినహాయింపు వంటివి ఇస్తామని కూడా ఉంది. ఒకవైపు ఆదాయం తగ్గించి, మరోవైపు ఖర్చు పెంచడం ఆర్థిక క్రమశిక్షణకు విరుద్ధం.
విజయ్ తన మ్యానిఫెస్టోలో టెక్నాలజీ(AI యూనివర్సిటీ, AI సిటీ), పారదర్శక పాలన గురించి మాట్లాడటం సానుకూల అంశం. కానీ, పైన పేర్కొన్న ప్రజాకర్షక పథకాలు ఓట్లను సంపాదించి పెట్టి వుండవచ్చు కానీ, పరిపాలనలో అడుగుపెట్టినప్పుడు అవి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుంగదీసే డబుల్ ఎడ్జ్ స్వోర్డ్(రెండు వైపులా పదునున్న కత్తి) లాంటివని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాట అప్పులకుప్ప రాష్ట్ర అధికార పీఠంపై కూర్చునేందుకు సిద్ధమవుతున్న టీవీకే విజయ్ ఏం చేస్తారన్నది చూడాల్సి వుంది.
