మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తోన్న డీఎంకే : సినీ నటి గౌతమి ఆరోపణ
తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వంపై సినీ నటి గౌతమి విమర్శలు గుప్పించారు. డీఎంకే పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. మహిళను కేవలం ఓటు బ్యాంకుగానే డీఎంకే నేతలు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మహిళలకు భద్రత లేదని, వారంతా అభద్రతా భావంతో జీవిస్తున్నారన్నారు.
కోయంబత్తూరులో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, జయలలిత హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఆమె తన చివరి శ్వాస వరకు మహిళల సాధికారానికి కట్టుబడివున్నారని, వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం మాత్రం మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు. మహిళలకు భద్రత, గౌరవం కల్పించడంతో సీఎం స్టాలిన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.
విళాత్తికుళం అత్యాచారం, హత్య ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించిన తీరును కూడా గౌతమి తప్పుబట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మహిళల హక్కుల కోసం సుమారు 28 నెలలుగా పోరాడుతున్నారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే పోటీ ఉంటుందని, రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం లేదని సినీ నటి గౌతమి జోస్యం చెప్పారు.