మమతా బెనర్జీనికి మరిన్ని కష్టాలు : లీగల్ నోటీసులు పంపిన టీఎంసీ నేతలు
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆమెకే లీగల్ నోటీసులు జారీచేశారు. ఇప్పటికే ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం తారా స్థాయికి చేరింది. ఒకవైపు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకే రెబల్ ఎంపీ కుమారుడు లీగల్ నోటీసులు పంపగా, మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇద్దరు లోక్‌సభ సభ్యులపై అధిష్టానం వేటు వేసింది. అదేసమయంలో ఓ సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
బీజేపీ నేతలతో సమావేశమయ్యారన్న వార్తల నేపథ్యంలో టీఎంసీ అధిష్టానం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కోల్‌కతా (ఉత్తర) ఎంపీ సుదీప్ బందోపాధ్యాయు ఆ నియోజకవర్గ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో మమత విధేయుడైన ఎమ్మెల్యే కునాల్ ఘోషన్‌ను నియమించింది. అదేవిధంగా, జాదవ్‌పూర్ ఎంపీ సాయోని ఘోషను కూడా పార్టీ యువజన విభాగం అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. శనివారం సుదీప్ బందోపాధ్యాయ్, మరో రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయిన కొన్ని గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
మరోవైపు, టీఎంసీ రెబల్ ఎంపీ కాకలీ ఘోష్ దస్తీదార్ కుమారుడు వైద్యనాథ్ ఘోష్ దస్తీదార్, మమతా బెనర్జీతో పాటు పలువురు టీఎంసీ నేతలకు లీగల్ నోటీసులు పంపారు. తనపై తప్పుడు, పరువునష్టం, కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బరాసత్ అసెంబ్లీ టికెట్ ఆశించడం వల్లే తన తల్లి కాకలీ ఘోష్ తిరుగుబాటు చేశారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, కాకలీ ఘోష్ నేతృత్వంలోని రెబల్ ఎంపీలు ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ పరిణామాల మధ్య, టీఎంసీ సీనియర్ నేత, మాజీ మంత్రి మానస్ రంజన్ భూనియా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగే అవకాశం కనిపించడం లేదని పేర్కొంటూ ఆయన తన రాజీనామా లేఖను మమతా బెనర్జీకి పంపారు.
