జార్ఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న రైలు (Video)
జార్ఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్‌ను దాటుతున్న ట్రక్కును ఓ రైలు ఢీకొట్టింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలింజన్ ముందుభాగం, ట్రక్కు వెనుక భాగం పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.
రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్‌ఘర్ జిల్లాలోని నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద భారీ ట్రాఫిక్ కారణంగా ఓ ట్రక్కు అక్కడే పట్టాలపైనే నిలిచింది. అంతలోనే వచ్చిన గోండా - అసాన్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొంది. ట్రక్కు పక్కకు జరిగిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం కలగలేదని జాసిడిహ్ స్టేషన్ మేనేజర్ శంకర్ శైలేష్ వెల్లడించారు.
ప్రమాదం కారణంగా జాసిడిహ్ - ఆసాన్‌సోల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు సుమారు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడిందని ఆసాన్‌సోల్ రైల్వేడివిజన్ అధికారి తెలిపారు. దెబ్బతిన్న ఇంజిన్‌ను తొలగించామని, ఈ ఘటనపై విచారణకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.