ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ పోరు : సువేందు వర్సెస్ మమతా బెనర్జీ

suvendu - mamata
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. ఇందులో బెంగాల్ అసెంబ్లీ విపక్ష నేతల సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీ చేయనున్నారు. ప్రస్తుతం టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ నుంచి ఆమె మళ్లీ పోటీ చేయనున్నారు. దీంతో ఆమెపై బీజేపీ తమ అభ్యర్థిగా సువేందు అధికారిని ఎంపిక చేసింది. ఆయన నందిగ్రామ్ అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేయనున్నారు. కాగా, భవానీపూర్ నియోజకవర్గం గత 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న విషయం తెల్సిందే. 
 
మరోవైపు, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు కూడా బీజేపీ 47మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేమమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మరో కేంద్ర మాజీ మంత్రి వి.మురళీధరన్‌కు కూడా తొలి జాబితాలో చోటుదక్కింది. 
 
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీపై పోటీ చేసి ఓడిపోయిన నవ్య హరిదాస్‌ను భాజపా అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపింది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లకు ఏప్రిల్‌ 9న ఎన్నికలు జరగనుండగా.. పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతల్లో (ఏప్రిల్‌ 23న 152 స్థానాలకు, 29న 142 సీట్లకు) పోలింగ్‌ నిర్వహించనున్నారు. 
 
మహిళలను ఓటు బ్యాంకుగా చూస్తోన్న డీఎంకే : సినీ నటి గౌతమి ఆరోపణ 
 
తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వంపై సినీ నటి గౌతమి విమర్శలు గుప్పించారు. డీఎంకే పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. మహిళను కేవలం ఓటు బ్యాంకుగానే డీఎంకే నేతలు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మహిళలకు భద్రత లేదని, వారంతా అభద్రతా భావంతో జీవిస్తున్నారన్నారు. 
 
కోయంబత్తూరులో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, జయలలిత హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. ఆమె తన చివరి శ్వాస వరకు మహిళల సాధికారానికి కట్టుబడివున్నారని, వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం మాత్రం మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు. మహిళలకు భద్రత, గౌరవం కల్పించడంతో సీఎం స్టాలిన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. 
 
విళాత్తికుళం అత్యాచారం, హత్య ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించిన తీరును కూడా గౌతమి తప్పుబట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మహిళల హక్కుల కోసం సుమారు 28 నెలలుగా పోరాడుతున్నారని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే పోటీ ఉంటుందని, రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం లేదని సినీ నటి గౌతమి జోస్యం చెప్పారు.