విమాన ప్రయాణం తర్వాత పొడిబారుతున్న చర్మం... ఎందుకో తెలుసా?
విమాన ప్రయాణం చేసిన తర్వాత అనేక మంది ప్రయాణికుల చర్మ పొడిబారిపోతోంది. దీంతో పలువురు ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలా రావడానికి కారణాలను చర్మ వ్యాధి నిపుణులు స్పందిస్తూ, క్యాబిన్‌లో తేమ శాతం 10 నుంచి 20 శాతానికి పడిపోవడమే ప్రధానకారమణని తెలిపారు. పైగా, విమాన ప్రయాణ సమయంలో ఒత్తిడి, నిద్రలేమి, యూవీ కిరణాలు కూడా చర్మంపై ప్రభావం చూపుతాయని, ఇది కూడా ఓ కారణమని తెలిపారు. ఈ సమస్య నుంచి అధికమించాలంటే నీరు ఎక్కువగా తాగడం, మాయిశ్చరైజర్ క్రీములు వాడాలని సూచన చేశారు.
విమానంలో గంటల తరబడి ప్రయాణించి గమ్యస్థానం చేరుకునే సమయానికి చర్మం పొడిబారి, బిగుసుకుపోయినట్లుగా, కాంతివిహీనంగా మారుతుంది. దీనినే చర్మవ్యాధి నిపుణులు 'ఎయిర్ పోర్ట్ స్కిన్' అని వ్యవహరిస్తారు. విమాన ప్రయాణంలో తలెత్తే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల చర్మంపై ఏర్పడే ప్రతికూల ప్రభావమే ఇందుకు ప్రధాన కారణమని వారు వివరిస్తున్నారు.
దీనిపై చర్మ నిపుణులు స్పందిస్తూ, విమాన క్యాబిన్‌లోని గాలిలో తేమ శాతం సాధారణంగా 10-20 శాతానికి పడిపోతుంది. దీనివల్ల చర్మం నుంచి తేమ వేగంగా ఆవిరైపోయి, సహజ రక్షణ పొరను కోల్పోతుంది. ఫలితంగా చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. వీటికి తోడు ప్రయాణ ఒత్తిడి, నిద్రలేమి, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలు సేవించడం, విమానాశ్రయ టర్మినల్స్ లోని ఏసీ గాలికి ఎక్కువ సమయం గురికావడం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
ముఖ్యంగా కిటికీ పక్కన కూర్చుని ప్రయాణించే వారిపై అధిక ఎత్తులో సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై మచ్చలు ఏర్పడటంతో పాటు ఇతర చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
'ఎయిర్ పోర్ట్ స్కిన్' సమస్యను అధిగమించడానికి నిపుణులు కొన్ని సులభమైన చిట్కాలను సూచిస్తున్నారు. ప్రయాణానికి ముందు, ప్రయాణ సమయంలోనూ పుష్కలంగా నీరు తాగాలి. కెఫిన్ అధికంగా ఉండే పానీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. చర్మానికి రక్షణ కల్పించే హైలురానిక్ యాసిడ్, సిరమైడ్లు వంటివి కలిగిన మాయిశ్చరైజర్‌ను వాడాలి. ముఖ్యంగా పగటిపూట ప్రయాణించే వారు తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రయాణం తర్వాత కూడా చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
