మీకోసం ఎన్నో చేశాం.. కూర్చొని వినండి... లేదంటే బాగుండదు.. మహిళలపై నితీశ్ చిందులు
తన బహిరంగ సభకు వచ్చిన మహిళలు అర్థాంతరంగా వెళ్లిపోతుండటం చూసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో మహిళలపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు. మీ కోసం ఎన్నో చేశాం.. కూర్చొని వినండి.. లేదంటే బాగుండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ఇటీవల మొదలుపెట్టిన 'సమృద్ధి యాత్ర'లో భాగంగా సివాన్ జిల్లాలో పర్యటించిన సీఎం నీతీశ్.. రూ.వందల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మహిళలు, ఇతర వర్గాల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.
ఆ సమయంలో కొందరు మహిళలు సభ నుంచి వెళ్లిపోతుండటాన్ని గమనించిన సీఎం.. ఎక్కడికి వెళ్లిపోతున్నారు? మేం చెప్పేది వినకపోతే మీ కోసం ఏం చేస్తున్నామో ఎలా తెలుస్తుంది? అని వ్యాఖ్యానించారు.
అయినప్పటికీ మహిళలు ఆగకుండా వెళ్లిపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. 'మీకోసం ఎన్నో చేశాం. కూర్చొని వినండి.. లేదంటే బాగుండదు' అని తీవ్ర స్వరంతో చెప్పడం చర్చనీయాంశమైంది. ఇదిలాఉంటే, బిహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నీతీశ్‌కు మహిళా ఓటర్లలో ప్రజాదరణ ఉంది.