సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2026 (10:19 IST)

నా భర్త, ఆయన స్నేహితులు బహ్రెయిన్‌లో వున్నారు.. కాపాడండి.. ఓ మహిళ విజ్ఞప్తి

Bahrain
Bahrain
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బహ్రెయిన్‌లో చిక్కుకున్న తన భర్త, మరో ఐదుగురిని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని హన్నా ఎలిజబెత్ అనే మహిళ కేంద్రానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. తన భర్త పేరు సాల్మన్ అని.. ఆయన తన స్నేహితులు ఆరుగురితో కలిసి బహ్రెయిన్‌కు పర్యటన కోసం వెళ్లారని తెలిపింది. 
 
ఫిబ్రవరి 24న వెళ్లగా ఫిబ్రవరి 28న తిరిగి రావాల్సి ఉంది, కానీ యుద్ధం కారణంగా విమానాలు రద్దు చేయబడ్డాయి. ఎటువంటి సహాయం లేకుండా విమానాశ్రయాన్ని ఖాళీ చేయమని వారిని కోరారు. ఇప్పుడు, భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అక్కడున్న పౌరులతో పాటు.. తన భర్త ఆయన స్నేహితులను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. 
 
కాగా అంతకుముందు సాల్మన్ రాజ్ ఒక వీడియో సందేశంలో పరిస్థితినిచాలా ప్రమాదకరమైనదిగా పేర్కొన్నాడు. వారు తిరిగి వచ్చే విమానం ఎక్కడానికి విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, చెక్-ఇన్ కౌంటర్లు మూసివేయబడ్డాయని.. అధికారిక సహాయం లేదని అన్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలను వెంటనే తరలించడానికి ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే తమతో పాటు చాలామంది ప్రయాణీకులు ఇక్కడ వున్నారని.. ఈ బృందంలో డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వృద్ధులు ఉన్నారని, వారు మందులు అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. 
 
ప్రిస్క్రిప్షన్లు లేకుండా, మందులు ఇవ్వడం లేదు. మేము రద్దీగా ఉండే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నాము. ఇక్కడి తెలుగు ప్రజలు ఏదో ఒక విధంగా మాకు రోజుకు ఒక భోజనం అందిస్తున్నారని రాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్ సతీమణి అక్కడున్న వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేసింది.