పుట్టిన రోజు అని ఇంటికి రమ్మని.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి.. సామూహిక అత్యాచారం
పుట్టినరోజు సాకుతో ఓ యువతిపై అకృత్యానికి పాల్పడ్డారు దుండగులు. బెంగళూరులో బర్త్‌డే వేడుకల పేరుతో నలుగురు స్నేహితులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 30న ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. 26 ఏళ్ల బాధితురాలికి సోమశేఖర్ అనే వ్యక్తితో చాలా కాలంగా పరిచయం ఉంది. ఇటీవల సదరు యువతి పుట్టినరోజు జరగ్గా, ఇద్దరం కలిసి బర్త్‌డే వేడుక చేసుకుందామని నమ్మించి, జూన్ 30న ఆమెను తలఘట్టపురకు ఆహ్వానించాడు.
ఆమె హోటల్‌కు వెళ్దామని చెప్పినప్పటికీ, వినకుండా ముందు తన ఇంటికి వెళ్లి ఆ తర్వాత హోటల్‌కు వెళ్దామని బలవంతం చేశాడు. ఇంట్లో అతని స్నేహితులను పిలిపించుకుని.. అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకడైన అంబరీశ్ అనే వ్యక్తి ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోవడంతో, అంబరీశ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మిగిలిన నలుగురు నిందితులు ఆ సమయంలో హాల్‌లోనే కాపలాగా కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత యువతికి పాక్షికంగా స్పృహ రావడంతో ఎలాగోలా నిందితుల బారి నుంచి తప్పించుకుంది. వెంటనే పోలీసు అత్యవసర సహాయక నంబర్ 112కు ఫోన్ చేసి తనకు జరిగిన దారుణాన్ని వివరించింది.
సమాచారం అందుకున్న తలఘట్టపుర పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు సోమశేఖర్, అంబరీశ్‌తో పాటు వారికి సహకరించిన ప్రదీప్, రామప్ప, జగదీశ్ అనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
