అమెరికాలో టీనేజీ యువకుల దాడిలో ఎన్నారై మృతి..!

Attacks
Ganesh|
FILE
అమెరికాలో ఒక టీనేజీ యువకుల గుంపు జరిపిన దాడిలో ప్రవాస భారతీయుడు ఒకరు దుర్మరణం పాలయ్యారు. అమెరికా ప్రవాస భారతీయుల్లో ప్రముఖ షాప్‌కీపర్‌గా గుర్తింపు పొందిన గుర్‌మెయిల్ సింగ్ అనే 63 సంవత్సరాల వ్యక్తిపై కొంతమంది టీనేజర్ల గుంపు దాడికి పాల్పడింది. అంతేగాకుండా సింగ్ షాపులో దొంగతనం చేసేందుకు ఈ గుంపు ప్రయత్నించటంతో అడ్డుకున్న ఆయనను చితకబాది పారిపోయారు.

యార్క్‌షైర్‌లోని హడ్డర్స్‌ఫీల్డ్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో తలకు తీవ్ర గాయాలైన గుర్‌మెయిల్ సింగ్, ఆదివారం రోజున హడ్డర్స్‌ఫీల్డ్‌లో రాయల్ ఇన్‌ఫిర్మరీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. కాగా.. సింగ్ మరణాన్ని హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.

ఈ కేసును విచారణ చేపట్టిన డిటెక్టివ్ సూపరిండెంట్ డేవిడ్ పెర్విన్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారంతా టీనేజర్లేననీ, వారంతా ముదురురంగు చొక్కాలను, ట్రాక్ షూటులను ధరించి ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. సింగ్ ఈ ప్రాంతంలో నివసించే ప్రవాస భారతీయులందరికీ బాగా చిరపరిచితుడనీ, చాలా సంవత్సరాలుగా ఆయన ఇక్కడ నివసిస్తున్నారని ఆయన వివరించారు. సింగ్ హత్యకు సంబంధించిన ఆధారాలు ఎవరివద్దనైనా ఉన్నట్లయితే వెంటనే తమకు అందించాల్సిందిగా ఈ సందర్భంగా పెర్విన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


దీనిపై మరింత చదవండి :