"అమెరికా పోలో కప్"లో పాల్గోనేది లేదు : భారత ఎంబసీ

Ganesh|
పిలవని పేరంటానికి వచ్చిన సలాహీ దంపతులు ఏర్పాటు చేసిన "అమెరికా పోలో కప్" అనే స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనకూడదని భారత ఎంబసీ నిర్ణయించింది. 2010 జూన్ నెలలో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాలుపంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు దౌత్య కార్యాలయం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

కాగా.. భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారిగా ఇచ్చిన అధికారిక విందుకు ఆహ్వానం లేకపోయినా బుల్లి తెర నటులు తారిఖ్ సలాహీ, మిషెల్‌లు హాజరైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వివాదం నెలకొన్న కారణంగా ఈ జంటతో భారత ఎంబసీ సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధపడింది.

ఇదిలా ఉంటే.. ఆహ్వాన పత్రాలు లేకుండానే విందుశాలలో ప్రవేశించి సలాహీ దంపతులు ఒబామాతో కరచాలనం చేయటమేగాక, మన్మోహన్ సింగ్‌ను కూడా పలుకరించారు. భద్రతా వైఫల్యం కారణంగానే తారిఖ్ జంట వైట్‌హౌస్‌లోకి ప్రవేశించిందనీ, జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుతున్నామని అమెరికా భద్రతా విభాగం సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సులివర్ పేర్కొన్న సంగతి పాఠకులకు తెలిసిందే.


దీనిపై మరింత చదవండి :