అమెరికా ప్రతినిధుల సభకు "రాజ్ గోయల్" పోటీ

Ganesh|
వచ్చే సంవత్సరంలో జరిగబోయే అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రవాస భారతీయుడు రాజ్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ తరపున కాన్సాస్ రాష్ట్ర ప్రతినిధిగా పనిచేస్తున్న ఈయన... ప్రతినిధుల సభకు గనుక ఎన్నికయినట్లయితే, ఈ ఘనత సాధించిన మూడో భారత సంతతి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు.

దిలీప్ సింగ్ సాంద్, బాబీ జిందాల్‌ల సరసన చేరనున్న రాజ్ గోయల్ మాట్లాడుతూ... ప్రతినిధుల సభ రేసులో ఉన్నాననీ, తమ రాష్ట్రానికి చెందిన ప్రజలు, వ్యాపారులు ఇప్పటికీ పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీటిని పరిష్కరించుకునేందుకు ప్రతినిధుల సభలో బలమైన నాయకత్వం కావాలని తామందరం బలంగా కోరుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయా సవాళ్లను ఎదుర్కోవాలంటే స్వతంత్ర భావాలు కలిగిన నాయకత్వం అవసరం అవుతుందని రాజ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కష్టపడి పనిచేయడం, ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకోవడం, సామాజిక బాధ్యత లాంటి కాన్సాస్ విలువలను వాషింగ్టన్‌లో ప్రతిబింబించేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... భారతదేశం నుంచి వలస వచ్చిన రాజ్ గోయల్ తల్లిదండ్రులు కాన్సాస్‌లోని విచితా నగరంలో స్థిరపడ్డారు. కాగా... 2008లో కాన్సాస్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన బోనీహయ్‌ను ఓడించి గోయల్ అప్పట్లో సంచలనం సృష్టించారు.


దీనిపై మరింత చదవండి :