ఆగని దారుణాలు: ఆసీస్‌లో మరో భారతీయుడిపై దాడి

Racial Attacks
Ganesh|
FILE
ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మెల్‌బోర్న్‌లో 29 సంవత్సరాల భారతీయ యువకుడిపై నలుగురు దుండగులు దాడిచేసి అతడికి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

జస్‌ప్రీత్ సింగ్ అనే భారతీయ యువకుడు మెల్‌బోర్న్‌లోని ఎసెండన్‌లో దాడికి గురైనట్లు ఏబీసీ కథనం వెల్లడించింది. భార్యతో కలిసి ఓ డిన్నర్ పార్టీకి వెళ్లిన సింగ్, ఇంటికి చేరుకున్నాక కారు పార్కింగ్ చేస్తుండగా దుండగులు దాడికి తెగబడి, ఒంటిపై ఇంధనం చల్లి నిప్పంటించి పరారైనట్లు ఏబీసీ వెల్లడించింది.

ఈ ఘటనలో 15 శాతం గాయాలకు గురైన సింగ్ ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ, అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఏబీసీ వివరించింది. ఇదిలా ఉంటే.. జస్‌ప్రీత్ ఆస్ట్రేలియన్ పౌరుడు కావటంవల్ల, ఇది జాత్యహంకార దాడి అయ్యే అవకాశం లేదని ఆసీస్ అధికారులు చెబుతున్నారు.

కాగా.. ఈనెల రెండో తేదీన భారతీయ విద్యార్థి నితిన్ గార్గ్ హత్య సంఘటనను మరువకముందే ఈ దాడి జరగటంతో అక్కడి భారతీయులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నితిన్ హత్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.


దీనిపై మరింత చదవండి :