"ఆరోగ్యశ్రీ"కి అమెరికా వైద్యుడి విరాళం

Ganesh|
ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకు సాయమందిస్తోన్న 'ఆరోగ్యశ్రీ' పథకానికి తన వంతు సాయంగా అమెరికాలోని ఆంధ్ర వైద్యుడు ప్రేమ్‌సాగర్ రెడ్డి 50 వేల డాలర్ల విరాళాన్ని అందజేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన 50వేల డాలర్ల (సుమారు 25 లక్షల రూపాయలు) చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించారు.

తన సోదరుడు సుగుణాకర్ రెడ్డి, మిత్రులు మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, రాఘవరెడ్డిలు ప్రేమ్‌సాగర్ రెడ్డి పంపించిన చెక్కును ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ పథకం కోసం వినియోగించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ప్రేమ్‌సాగర్ రెడ్డి రాసిన లేఖను కూడా ఈ సందర్భంగా వారు సీఎంకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రేమ్‌సాగర్ రెడ్డి దాతృత్వాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. అల్పాదాయ వర్గాలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం కోసం ఇలాగే స్వచ్చంధ సంస్థలవారు, సేవాతత్పరులు ఉదారంగా విరాళాలను అందజేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.


దీనిపై మరింత చదవండి :