ఆసీస్‌లో ఫీజుల వాపస్: భారత విద్యార్థుల పాట్లు..!!

Students
Ganesh|
FILE
ఆస్ట్రేలియాలో వేలాదిమంది భారతీయ విద్యార్థులు తాము చెల్లించిన ఫీజులను తిరిగి పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తాజా వలస విధానాల కారణంగా వీసాల తిరస్కరణకు గురైన భారత విద్యార్థులు, ఆయా విద్యా సంస్థలకు తాము ముందుగానే చెల్లించిన ట్యూషన్ ఫీజులను తిరిగి పొందేందుకు తంటాలు పడుతున్నారు.

ది ఏజ్ వార్తాపత్రిక కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులు మరియు అక్రమాలు జరుగుతున్న పలు కళాశాలల మూసివేత కారణంగా.. విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారతీయ విద్యార్థులు తాము ముందుగానే చెల్లించిన ట్యూషన్ ఫీజులను తిరిగి పొందేందుకు క్యూలు కడుతున్నట్లుగా తెలుస్తోంది.

కాగా.. ఇలా ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం మిలియన్ డాలర్లలో ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఫీజుల మొత్తం గురించి ఖచ్చితమైన వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆసీస్ విద్యాశాఖ అధికారులు నిరాకరిస్తున్నట్లు ది ఏజ్ పేర్కొంది.

సాధారణంగా విదేశీ విద్యార్థులు ముందుగానే చెల్లించిన ఫీజుల వివరాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం "ప్రొవైడర్ రిజిస్ట్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ప్రిజమ్)" అనే డేటాబేస్‌లో నమోదు చేస్తుంటుంది. ఇందులో నమోదైన వివారల ప్రకారం విదేశీ విద్యార్థులు ఆసీస్ విద్యాశాఖను సంప్రదించి, ట్యూషన్ ఫీజులను తిరిగి చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు.

అయితే అందుకు నిరాకరించిన ఆసీస్ విద్యాశాఖ.. కేసుల వారీగా విద్యార్థులకు తిరిగి చెల్లించాల్సిన ఫీజుల వివరాలను పరిశీలిస్తున్నట్లు మాత్రమే వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం ఏదేని పరిస్థితుల్లో విద్యార్థులకు వారి ట్యూషన్ ఫీజులను తిరిగి చెల్లించాల్సివస్తే.. 28 రోజులలోగానే చెల్లించాల్సి ఉంటుంది. కాగా, విద్యార్థులు ముందస్తుగా చెల్లించిన ఫీజులను ఆ దేశ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సారధ్యంలోని ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫర్ ఓవర్సీస్ స్టూడెంట్స్ అస్సురెన్స్ ఫండ్ జాగ్రత్త చేస్తుంది.


దీనిపై మరింత చదవండి :