ఆసీస్‌లో మరో ఘాతుకం.. భారతీయుడి హత్య..!

Ausis Attacks
Ganesh|
FILE
పంజాబీ యువకుడు నితిన్ గార్గ్ హత్య జరిగి మూడు రోజులు గడవకముందే ఆస్ట్రేలియాలో మరో ఘాతుకం వెలుగుచూసింది. పాక్షికంగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక భారతీయుడి మృతదేహాన్ని ఆ దేశ పోలీసులు గుర్తించారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌లో వారం రోజుల క్రితం ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. అది భారత్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిదిగా తేలటంతో అక్కడి భారతీయుల్లో కలవరం సృష్టిస్తోంది.

ఆస్ట్రేలియాలో తరచుగా భారతీయులపై, ముఖ్యంగా విద్యార్థులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ దాఖలాలు ఉన్నాయిగానీ, తాజాగా నితిన్ గార్గ్‌ను మాత్రం దుండగులు కత్తితో పొడవటంతో చనిపోయాడు. నితిన్ మరణానికి ముందుగానే ఓ భారతీయ యువకుడు హత్యకు గురైనా, వెలుగుచూడలేదు. అయితే ఇప్పుడు పేర్కొన్న మృతుడు జాత్యహంకారదాడిలోనే బలయ్యాడా, లేదా అన్నది స్పష్టం కాలేదు.

ఆసీస్‌లోని గ్రిఫిత్ అనే ప్రాంతంలో డిసెంబర్ 29వ తేదీన ఈ యువకుడి మృతదేహం లభించిందనీ, మృతుడి కుటుంబ సభ్యులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా.. గత ఆదివారం రోజున మెల్‌బోర్న్ నగరంలో నితిన్ గార్గ్ అనే 21 సంవత్సరాల విద్యార్థి హత్యకు గురైన సంగతి విదితమే. ఈ హత్యపై ఆ దేశంలోనూ, భారత్‌లోనూ తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలంటూ అందరూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరో భారత యువకుడి హత్య వెలుగు చూడటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.


దీనిపై మరింత చదవండి :