ఆసీస్ దాడులపై నివేదిక విడుదలలో పోలీసుల జాప్యం..!

Ausis Attacks
Ganesh|
FILE
భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల వెనుకనున్న కారణాలను శోధించి తయారుచేసిన పరిశోధనా పత్రాన్ని విడుదల చేసే అంశంలో ఆస్ట్రేలియా పోలీసులు జాప్యం ప్రదర్శిస్తున్నారు. విక్టోరియా యూనివర్సిటీ రూపొందించిన ఈ నివేదికను పోలీసులు సమీక్షించి విడుదల చేయాల్సి ఉంది. అయితే దీనిని గత సంవత్సరం నవంబర్‌లోనే విడుదల చేయాల్సి ఉండగా, ఫిబ్రవరి 16న బయటికి వెల్లడించే అవకాశం ఉన్నట్లు "ద ఆస్ట్రేలియన్" పత్రిక పేర్కొంది.

ఇదిలా ఉంటే.. జాతివివక్ష దాడులకు గల కారణాలను తెలుసుకునేందుకుగానూ గత సంవత్సరం జూన్ నెలలో ఒక సర్వేను చేపట్టారు. దాని ద్వారా ఓ పరిశోధనా పత్రాన్ని తయారు చేయగా, అది పోలీసుల సమీక్షకోసం వెళ్లింది. విద్యార్థులు, భారతీయులను సర్వేలు, ఇంటర్వ్యూలు చేసి పలు ఆధారాలను సేకరించి తయారు చేసిన ఈ నివేదికను విడుదలో చేసేందుకు పోలీసులు ఆలస్యం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విక్టోరియా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ లిండా రోజన్‌మాన్ మాట్లాడుతూ.. తాము తయారు చేసిన నివేదికను విడుదల చేసేందుకు పోలీసుల అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. అయితే, 210 పేజీలున్న ఈ నివేదికను అన్ని కోణాలలో పరిశీలించి సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విక్టోరియా పోలీస్ అధికారి సిమన్ ఫాస్టర్ పేర్కొన్నారు.

కాగా.. దీనిపై స్పందించిన ఆసీస్‌లోని భారతీయ విద్యార్థి సమాఖ్య ప్రతినిధి గౌతమ్ గుప్తా.. నివేదిక విడుదల ఆలస్యం దురదృష్టకరమని, జాప్యం పలు అనుమానాలకు కూడా తావిస్తోందని వ్యాఖ్యానించారు.


దీనిపై మరింత చదవండి :