ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి ఆత్మహత్య

Nri news
Ganesh|
FILE
ఉద్యోగం దొరకని కారణంగా.. ఇకపై తన చదువు ముందుకు సాగదేమోనన్న ఆందోళనతో గుర్జీందర్ సింగ్ (20) అనే భారత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా... మూడు నెలల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళిన ఇతను లాట్రోబ్ విశ్వవిద్యాలయంలో అకౌంటింగ్ కోర్సులో చేరి చదువుకుంటున్నాడు.

ఈ విషయమై ఆస్ట్రేలియాలోని భారత రాయబారి అనితా నాయర్ మాట్లాడుతూ... సింగ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని, ఇతని విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. అయితే సింగ్ మృతికి గల కారణాలను దర్యాప్తు నివేదిక త్వరలోనే తెలియజేస్తుందని అనిత చెప్పారు.

ఇదిలా ఉంటే... గుర్జీందర్ ఆత్మహత్య, వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల సమాఖ్య వ్యవస్థాపకుడు గౌతమ్ గుప్తా ఆరోపించారు. ఇటీవల భారతీయులపై జరుగుతున్న దాడులకు కూడా సింగ్ కుంగిపోయి, ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించి ఉండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు. సింగ్ మృతికి విక్టోరియా రాష్ట్ర ప్రధాని జాన్ బ్రంబీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


దీనిపై మరింత చదవండి :