ఇలాంటి దాడులు గర్హనీయం : జూలియా గిల్లార్డ్

Racial Attacks
Ganesh|
FILE
మెల్‌బోర్న్‌లో భారతీయ విద్యార్థి నితిన్ గార్గ్‌పై జరిగిన దాడిని ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు నితిన్‌పై జరిగిన దాడిని ఖండించిన ఆస్ట్రేలియా ఉప ప్రధాని జూలియా గిల్లార్డ్... నితిన్‌ మృతికి తన ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా.. 21 సంవత్సరాల అకౌంటింగ్ గ్రాడ్యుయేట్ విద్యార్థి నితిన్ గార్గ్ అనే పంజాబీ యువకుడిని గత శనివారం రోజున ముష్కరులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నితిన్ కొంతదూరం అలాగే పరిగెట్టి, ఓ ఆసుపత్రి ముందు పడిపోయాడు. గాయాలతో పడి ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం చికిత్స పొందుతుండగానే నితిన్ మృతి చెందాడు.

ఇదిలా ఉంటే.. భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణ నితిన్ హత్యను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా, ఇప్పటికైనా ప్రభుత్వం భారత విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోకపోతే, కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.

అలాగే.. అస్ట్రేలియాలోని భారత విద్యార్థుల సంఘం వ్యవస్థాపకుడు గౌతమ్ గుప్తా, నితిన్ హత్యను తీవ్రంగా ఖండించారు. రోజురోజుకూ ఆసీస్‌లో భారత విద్యార్థులకు రక్షణ కరవవుతోందని అతను వాపోయాడు. మరోవైపు, నితిన్‌పై దాడి జాత్యహంకారంతో కూడుకున్నదా, లేదా అనే విషయం విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.


దీనిపై మరింత చదవండి :