ఎన్నారై డాక్టర్ హత్య: విషాదంలో కుటుంబ సభ్యులు

Nri News
Ganesh|
FILE
అమెరికాలో ప్రవాస భారతీయ వైద్యుడు వాజిందర్ తూర్ (34), తన మాజీ సహచరుడి చేతిలో కాల్పులకు గురై మరణించటంతో మొహాలీలోని అతని కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. భార్య పర్ణీత సిద్ధు, మూడేళ్ల కుమారుడితో కలిసి కనెక్టికట్‌లోని బ్రాండ్‌ఫోర్డ్‌లో నివసిస్తున్న వాజిందర్, లీసన్ వాంగ్ (44) అనే ఓ చైనా డాక్టర్ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

దీంతో వాజిందర్ కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా వాజిందర్ బంధువు ప్రకాష్ సింగ్ మాట్లాడుతూ.. వాజిందర్ భౌతికకాయాన్ని స్వదేశం తీసుకొచ్చేందుకు అతని తండ్రి సోహన్ సింగ్ తూర్ అమెరికా బయలుదేరారని పేర్కొన్నారు. వాజిందర్ సోదరుడు, తల్లి గురువారం యూఎస్ బయలుదేరనున్నట్లు చెప్పారు.

తమకు తెలిసిన సమాచారం ప్రకారం దుండగుడు ఎనిమిదిరౌండ్ల కాల్పులు జరిపాడనీ, ఐదు బుల్లెట్లు వాజిందర్ శరీరంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోందని ప్రకాష్ సింగ్ వివరించారు. కాగా.. తన కొడుకు అన్యాయంగా మృత్యువాత పడటంతో వాజిందర్ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఆమె వాపోతోంది.

ఇదిలా ఉంటే.. 2001వ సంవత్సరంలో పంజాబ్‌లోని మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసిన వాజిందర్, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అనంతరం యాలే న్యూ హెవెన్ హాస్పిటల్‌లో ఫెలోషిప్ పొందిన ఈయన ఇన్‌ఫెక్టియస్ డిసీజ్ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. కాగా.. వాజిందర్ తండ్రి హర్యానాలో ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.


దీనిపై మరింత చదవండి :