"ఎయిర్‌లైన్ సీఈఓ ఆఫ్ ద ఇయర్‌"గా ఎన్నారై

Airoplain
Ganesh|
FILE
అతి తక్కువ ధరలకే విమానయానాన్ని అందిస్తూ శరవేగంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న ప్రముక విమానయాన సంస్థ ఎయిర్ ఆసియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్.. ఈ ఏడాదికిగానూ "ఎయిర్‌లైన్ సీఈఓ ఆఫ్ ద ఇయర్"గా ఎంపికయ్యాడు. సంస్థ అభివృద్ధిలో కీలక భూమిక పోషించిన టోనీ భారత సంతతి వ్యక్తి కావడం విశేషంగా చెప్పవచ్చు.

ప్రపంచమంతటా ఆర్థికమాంద్యంతో కుదేలవుతున్న ప్రస్తుత దశలో పలు విమానయాన సంస్థలు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టోనీ నేతృత్వంలోని ఎయిర్ ఆసియా మాత్రం దినదినాభివృద్ధిని సాధిస్తోంది. కేవలం 2 విమానాలు, 250 మంది సిబ్బందితో ప్రారంభమైన ఎయిర్ ఆసియా, ప్రస్తుతం 82 విమానాలు, 6,500 మంది సిబ్బందిగల సంస్థగా ఎదిగింది.

ఎయిర్ ఆసియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన టోనీకి ఈ అవార్డును ఇస్తున్న "జేన్స్ ట్రాన్స్‌ఫోర్ట్ ఫైనాన్స్" మేగజీన్... ఈ అవార్డుకు టోనీ అర్హుడని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ.. తానొక్కడినే కాక సంస్థ సిబ్బంది మొత్తం కలిసి ఈ విజయాన్ని అందుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. ఎయిర్ ఆసియా ప్రస్తుతం భారత్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతోపాటు ఆసియాన్ దేశాలు.. మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్, కంబోడియా, మయన్మార్, లావోస్, వియత్నాం, సింగపూర్, బ్రూనై, ఫిలిప్ఫీన్స్ తదితర దేశాలకు తన సర్వీసులను విజయవంతంగా నడుపుతోంది.


దీనిపై మరింత చదవండి :