ఓడలో తరలిరానున్న "నాట్స్" వరద సహాయ సామగ్రి

Floods
Ganesh|
FILE
వరద బాధితులకు సహాయం అందించాలన్న తమ పిలుపుకు మంచి స్పందన లభిస్తోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగా తాము సేకరించిన సహాయ సామగ్రిని సముద్ర మార్గం ద్వారా ఓడలో భారతదేశానికి పంపిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

అక్టోబర్ 13వ తేదీన సహాయ సామగ్రితో కూడిన డ్రాప్ బాక్సులను ఫెడెక్స్‌లోని వేర్‌హోస్‌కు తరలించనున్నామనీ.. 19వ తేదీన న్యూయార్క్ నుంచి బయలుదేరనుందని నాట్స్ ఈ మేరకు వివరించింది. కాగా, వరద బాధితుల కోసం సహాయం అందించగోరే దాతలు నేరుగా తమ సహాయాన్ని వేర్‌హౌస్‌కు పంపించవచ్చుననీ లేదా తమ ప్రతినిధులకు అందజేయవచ్చునని నాట్స్ ఈ సందర్భంగా సూచించింది.

ఇదిలా ఉంటే.. జలప్రళయంతో నిరాశ్రయులైన తెలుగు ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులంతా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో ఉంటున్న కొంతమంది ప్రవాసాంధ్రులు "37 ఛార్జర్స్" గ్రూపుగా ఏర్పడి వరద బాధితులకు తమ ఆపన్న హస్తాన్ని అందించారు. ఇందులో భాగంగా వారు రెండు లక్షల రూపాయలను సేకరించి సాయం చేశారు.

అంతేగాకుండా.. వరదలకు దెబ్బతిన్న కర్నూలు జిల్లా మందలపాడు గ్రామాన్ని 37 ఛార్జర్స్ దత్తత తీసుకున్నారు. అలాగే.. ఈ ప్రతినిధులు నేరుగా వరద బాధిత ప్రాంతాలకు వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులకు మరింతగా సహాయం అందించేందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగువారు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.


దీనిపై మరింత చదవండి :