కృష్ణ రాకకై ఆసీస్ వర్సిటీల ఎదురుతెన్నులు

Ganesh|
FILE
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో... ఆ దేశానికి వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల సంఖ్య రాన్రానూ తగ్గుతుండటంవల్ల గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆసీస్ యూనివర్సిటీలు భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం. కృష్ణతో సమావేశమయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఆసీస్‌లో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ విలవిలలాడుతున్న విద్యారంగాన్ని భారత విదేశాంగ మంత్రి ఒడ్డు పడేయగలరని అక్కడి యూనివర్సిటీలు భావిస్తున్నాయి. కాగా... ఎస్.ఎం. కృష్ణ ఆగస్టు నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. భారత విద్యార్థులపై వరుస దాడులు, అవకతవకలతో పాటు పలు కాలేజీలు మూతపడుతున్న పరిస్థితుల్లో భారత విదేశాంగ మంత్రి ఆసీస్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియా యూనివర్సిటీల సీఈఓ గ్లెన్ వితర్స్ ఓ రేడియోతో మాట్లాడుతూ, భారత మీడియాలో వచ్చిన కథనాలతో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు బాగా నష్టపోయాయని వాపోయారు. అయితే వాస్తవ పరిస్థితిని కృష్ణకు వివరించాలని యూనివర్సిటీలు భావిస్తున్నట్లు ఆయన వివరించారు.


దీనిపై మరింత చదవండి :