కేసీఆర్ అరెస్టును ఖండించిన ఎన్నారైలు..!

KCR
Ganesh|
FILE
తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును పోలీసులు అరెస్టు చేయడాన్ని కాలిఫోర్నియాకు చెందిన తెలంగాణా ఎన్నారైలు ముక్తకంఠంతో ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న కేసీఆర్‌ను అరెస్టు చేయటంపట్ల ఎన్నారై ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ అసంతృప్తిని, నిరసనను శాంతియుతంగా, ప్రజాస్వామ్య విధానంలో వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని విజయ్ చవ్వ పై ప్రకటనలో వెల్లడించారు. పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

బే ఏరియాలో ప్రత్యేకంగా సమావేశమైన పలువురు ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారని చవ్వ వివరించారు. శాంతియుతంగా నిర్వహించే ఆందోళనలకు ఆటంకం కలిగించవద్దని ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. సున్నితమైన తెలంగాణ అంశం కోసం ఉద్యమిస్తున్న తెరాస నాయకులు, శ్రేణులు శాంతి, సహనం, సంయమనం పాటించాలని ఎన్నారైలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసిందన్నారు.

అలాగే.. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత మార్గంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వారంతా.. తగిన ఉపయోగకరమైన మార్గాలను ఎంచుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారైల ప్రత్యేక సమావేశం సూచించిందని విజయ్ చవ్వ తన ప్రకటనలో తెలియజేశారు.


దీనిపై మరింత చదవండి :