కోలాహలంగా "తానా మహాసభలు"

FILE
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 17వ మహాసభలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలలో ఒకటయిన చికాగో నగరంలో ఈ మహాసభలు గురువారం రాత్రి కన్నులపండువగా మొదలయ్యాయి. రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్‌లో ముందుగా నిర్వహించిన బ్యాంక్వెట్ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇల్లినాయిస్ గవర్నర్ ప్యాట్ క్విన్ ఈ మహాసభలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ... అమెరికాలో తెలుగువారి ప్రాబల్యం వివిధ రంగాలలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇల్లినాయిస్ ప్రజల తరపున తెలుగు ప్రజలకు అభినందనలు తెలియజేసిన ఆయన చికాగోలో తానా మహాసభలను నిర్వహించటం సంతోషదాయకమని పేర్కొన్నారు.

ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామిక దేశాలయిన భారత్-అమెరికాల నడుమ విడదీయరాని సంబంధాలు ఏర్పడ్డాయని, ప్రపంచ దేశాలకు ఈ రెండు దేశాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్యాట్ క్విన్ అభిప్రాయపడ్డారు. కూచిపూడి, భరతనాట్యం లాంటి కళలకు పుట్టినిల్లయిన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు గొప్పవని ఆయన ప్రశంసించారు.

తదనంతరం వివిధ రంగాలలో ప్రతిభ చూపిన వారికి తానా అవార్డులను అందజేసింది. సినీనటుడు మురళీమోహన్, ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ప్రసంగిస్తూ... అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో సమైక్యంగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఆకాంక్షించారు.

Ganesh|
ఈ మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు కాకరాల ప్రభాకర చౌదరి ఆహుతులందరికీ స్వాగతం పలికారు. మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీ నటులు పెద్ద ఎత్తున హాజరైన సభల ఏర్పాట్లను తానా కార్య నిర్వాహక అధ్యక్షుడు కోమటి జయరాం, ఉపాధ్యక్షుడు తోటకూర ప్రసాద్, కోశాధికారి నన్నపనేని మోహన్, ఉత్సవాల కో-ఆర్డినేటర్ యుగంధర్ తదితరులు పర్యవేక్షించారు.


దీనిపై మరింత చదవండి :