గోర్డెన్ బ్రౌన్‌ను ప్రశ్నించిన ఎన్నారై ఎంపీ

NRI Man
Ganesh|
FILE
బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డెన్ బ్రౌన్ క్యాబినెట్‌లో ఆసియా వాసులకు తగిన విధంగా న్యాయం లభించలేదంటూ హౌస్ ఆఫ్ కామన్స్ కమిటీ సమావేశంలో భారత సంతతి ఎంపీ పరంజీత్ ధండా (38) ఆరోపించారు. రెండు సంవత్సరాల క్రితం బ్రౌన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి క్యాబినెట్‌లో ఇద్దరు నిర్దిష్ట జాతికి చెందిన మైనారిటీ వర్గీయులు ప్రాతినిధ్యం వహించారనీ, ఇప్పుడు ఒక్కరికి కూడా ఆ గౌరవం దక్కలేదని ఆయన ఆరోపించారు. దీన్ని మీరు అంగీకరిస్తారా..? అంటూ పరంజీత్, బ్రౌన్‌ను ప్రశ్నించారు.

పరంజీత్ ప్రశ్నకు స్పందించిన గోర్డెన్ బ్రౌన్ మాట్లాడుతూ... ఏడుగురు మహిళలకు స్థానం లభించటమేగాక, క్యాబినెట్‌కు తొలిసారి ఎంపిక అయిన ఆసియా సంతతి వాసి కీలక రవాణారంగ విధులను నిర్వహిస్తున్నారన్నారు. అంతేగాకుండా.. తొలిసారిగా ఒక నల్లజాతీయుడు అటార్నీ జనరల్‌గా ఎంపికయిన విషయాన్ని మర్చిపోవద్దని ఈ సందర్భంగా బ్రౌన్ పరంజీత్‌కు సూచించారు.

అంతకుమునుపు.. ప్రభుత్వ నిర్వహణలో ఆసియా, ఆసియా యేతర సంతతి ప్రజలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని గోర్డెన్ బ్రౌన్ ఉద్ఘాటించారు. ప్రభుత్వంలో ఆసియావాసులు కీలక బాధ్యతలు నిర్వహించకపోతే వారికి ప్రాధాన్యం తగ్గిపోయిందనుకోవటం అర్థరహితం అన్నారు. పాలన సాఫీగా సాగాలంటే రెండు వర్గాల ప్రజలు అవసరమేననీ.. ఆసియా వాసులతోపాటు ఇతర కమ్యూనిటీ వాసులకు కూడా తమ పాలనలో సమాన గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు.


దీనిపై మరింత చదవండి :