జాత్యహంకార ఈ-మెయిల్ జోక్: ఇద్దరు కౌన్సిలర్ల సస్పెన్షన్

Nri News
Ganesh|
FILE
యూకేలోని ల్యాంకాషైర్‌లోగల రిబ్బిలే వ్యాలీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు జాత్యహంకారంతో కూడిన ఓ ఈ-మెయిల్‌ను సర్క్యులేట్ చేసినందుకుగానూ కన్జర్వేటివ్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. భారత్ మరియు ఇతర ప్రాంతాలనుంచి వచ్చి స్థిరపడిన ప్రవాసులను ఉద్దేశించి రూపొందిన ఆ ఈ-మెయిల్ జోక్‌పై సీరియస్‌గా స్పందించిన కన్జర్వేటివ్ పార్టీ ఇద్దరు కౌన్సిలర్లను పార్టీనుంచి సస్పెండ్ చేసింది.

కాగా.. సస్పెన్షన్‌కు గురైన కౌన్సిలర్లలో సైమన్ ఫార్న్స్‌వర్త్ ఒకరు. ఈయన రిబ్బిలే వ్యాలీకి ప్రస్తుతం కౌన్సిలర్‌గా పనిచేస్తున్నారు. ఈయన తన సహ కౌన్సిలర్ అయిన కెన్ హింద్‌కు జాత్యహంకార ఈ-మెయిల్ జోక్‌ను పంపించాడు. కాగా.. హింద్ 1992 మరియు 1997లలో జరిగిన ఎన్నికలల్లో ల్యాంకైషేర్ దక్షిణ ప్రాంతమైన సెల్బీ నుంచి కన్జర్వేటివ్ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేశాడు.

సైమన్ నుంచి ఈ-మెయిల్ జోక్‌ను అందుకున్న హింద్.. ఏకంగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులందరికీ ఆ జోక్‌ను పంపించాడు. ఈ విషయం కాస్తా పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లగా, దానికి తీవ్రంగా స్పందించింది. అంతేగాకుండా.. ఇందుకు కారకులైన ఇద్దరు కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు యూకేలో జరుగనున్న ఎన్నికలకు వలస ప్రజానీకం ప్రధాన సమస్యగా మారనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోకి లెక్కకుమించి వలస ప్రజానీకం అడుగుపెట్టడంతో, అది ప్రజా సంక్షేమంపై ప్రభావం చూపిస్తోందంటున్నారు. అటు ఆర్థికంగానూ, ఇటు ఇతర ఉపయోగాలను వలస ప్రజలు తన్నుకుపోతున్నట్లు వారు భావిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :