"డాక్టర్ డెత్"ది అనుభవ రాహిత్యమే: బ్రిస్బేన్ సుప్రీంకోర్టు

Nri News
Ganesh|
FILE
ఒక మేజర్ సర్జరీని చేయటంలో భారత సంతతి వైద్యుడు డాక్టర్ జయంత్ పటేల్ (59) అనుభవరాహిత్యంతో వ్యవహరించాడని బ్రిస్బేన్ సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. కాగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ముగ్గురి మరణానికి కారణమవటమేగాకుండా, మరొకరి శరీరానికి హాని కలిగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పటేల్‌పై బ్రిస్బేన్ సుప్రీంకోర్టులో నిన్న విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన బ్రిస్బేన్ న్యాయస్థానం, ఈ కేసుల్లో జయంత్ అనుభవరాహిత్యంతో వ్యవహరించినట్లు అర్థమవుతోందని ప్రకటించింది. మరోవైపు సోమవారం విచారణ మొదటి రోజున "నేను దోషిని కాను, నాకు ఏ పాపం తెలియదు యువరానర్" అంటూ ఆస్ట్రేలియాలో "డాక్టర్ డెత్"గా పేరుమోసిన జయంత్ న్యాయమూర్తి జాన్ బయర్నే ముందు విలపించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. నిర్లక్ష్యపూరితంగా ఆపరేషన్లు చేసిన డాక్టర్ జయంత్.. మెర్విన్ జాన్ మోరిస్, జేమ్స్ ఎడ్వర్డ్ ఫిలిప్స్, గెర్రీ కెంప్స్ అనే ముగ్గురి మరణానికి, ఇయాన్ రోడ్నీ వోల్వ్స్ శరీరానికి హాని కలిగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2003-05 మధ్యకాలంలో క్వీన్స్‌లాండ్‌లోని బండాబెర్గ్ ఆసుపత్రిలో విధులు నిర్వహించిన సందర్భంగా డాక్టర్ జయంత్‌పై ఈ కేసులు నమోదయ్యాయి.

అమెరికాలో పట్టుబడిన పటేల్‌ను విచారణ నిమిత్తం 2008లో ఆసీస్‌కు అప్పగించారు. మరోవైపు పది వారాలపాటు కొనసాగే ఈ విచారణలో 90 మంది సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేయనుంది. ఈ విచారణలో నేరం గనుక రుజువయినట్లయితే ఆసీస్ చట్టాల ప్రకారం జయంత్‌కు జీవితఖైదు విధించే అవకాశం ఉంది.


దీనిపై మరింత చదవండి :