నిరుపేద ఎన్నారై విద్యార్థుల కోసం "5కె రన్"

Nri kids
Ganesh|
FILE
వర్జీనియాలో భారత సంతతికి చెందిన నిరుపేద బాల బాలికల్లో విద్య, ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధులను సేకరించేందుకు 5కె రన్‌ను నిర్వహించనున్నట్లు "ఆశా జ్యోతి" అనే సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా పెద్దలకు 5కె రన్, చిన్నారులకు ఒక మైలు దూరం పరుగు పోటీలను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఉదాత్తమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవటం ద్వారా చేయూతను అందించాలని ఆశా జ్యోతి సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమం గురించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు, తెలిసిన వారందరికీ తెలియజేసి తగిన ప్రచారం కల్పించాలని కూడా ఆ సంస్థ ఓ ప్రకటనలో కోరింది.

ఇందులో భాగంగా సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 8 గంటలకు 5 కె రన్, 830 గంటలకు చిన్నారుల ఒక మైలు పరుగు పందేలను నిర్వహించనున్నట్లు ఆశా జ్యోతి సంస్థ వివరించింది. వర్జీనియాలోని ఫైర్‌ఫాక్స్ ప్రాంతంలోగల ఫైర్‌ఫాక్స్ కార్నర్ నుంచి 5కె రన్ ప్రారంభమవుతుందనీ.. ఇందులో పాల్గొనే ఉత్సాహవంతులు సెప్టెంబర్ 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజుగా 20 డాలర్లను చెల్లించాలని ఆ సంస్థ తెలిపింది.

అలాగే ఒక మైలు పరుగు పందెంలో పాల్గొనే చిన్నారులు 10 డాలర్లను చెల్లించాలని ఆశా జ్యోతి సంస్థ స్పష్టం చేసింది. కాగా.. 5 కె రన్‌లో పాల్గొనేందుకు పేర్లను నమోదు చేసుకున్నవారు సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం 4-8 గంటల మధ్యలో వర్జీనియాలోని "డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్" నుంచి తమ ప్యాకెట్లను తీసుకెళ్లవచ్చని సంస్థ తెలియజేసింది.


దీనిపై మరింత చదవండి :