పాక్‌లో అపహరణకు గురైన రాబిన్ సింగ్ విడుదల

Nri news
Ganesh|
FILE
దాదాపు రెండు నెలల క్రితం పాకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులచే అపహరణకు గురైన హిందూ యువకుడు ఒకరు క్షేమంగా స్వగృహం చేరుకున్నాడు. ఇన్నిరోజులుగా తమ ఆధీనంలో ఉంచుకున్న దుండగులు ఎట్టకేలకు తమ కుమారుడిని నార్త్ వెస్ట్రన్ పాకిస్తాన్‌ నగరమైన పెషావర్‌లో వదిలిపెట్టి వెళ్లారని అతని కుటుంబ సభ్యులు సోమవారం వెల్లడించారు.

కాగా.. రాబిన్ సింగ్ అనే ఓ కంప్యూటర్ ఇంజనీర్‌ని గత ఫిబ్రవరి నెల 12వ తేదీన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. పెషావర్‌లోని యూనివర్సిటీ రోడ్‌కు దగ్గర్లో ఒక మార్కెట్‌వద్ద మాటుకాసిన దుండగులు సింగ్‌ను ఎత్తుకెళ్లిపోయారు. ఇన్ని రోజులుగా బందీగా ఉంచుకున్న దుండగులు గత రాత్రి పెషావర్‌లోని రింగ్ రోడ్డువద్ద విడిచిపెట్టివెళ్లారు.

ఈ విషయమై సింగ్ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడిని విడిచిపెట్టినందుకు దుండగులు ఎలాంటి డిమాండ్లను వ్యక్తం చేయలేదన్నారు. అయితే వాళ్లు రాబిన్ సింగ్‌ను ఎందుకు అపహరించుకుపోయారన్న సంగతి కూడా తెలియటంలేదని అన్నారు.

ఇదిలా ఉంటే.. సింగ్ అపహరణ జరిగిన వెంటనే అతని సోదరుడు రాజన్ సింగ్ పెషావర్‌లోని వెస్ట్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు. అలాగే.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా రాబిన్ కిడ్నాపింగ్‌ను ఖండించారు. అంతేగాకుండా సింగ్ విడుదల కోసం అవసరమైన అన్ని చర్యలను చేపట్టాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే సింగ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ఎందుకోసం అతడిని కిడ్నాప్ చేశారు, ఎలాంటి డిమాండ్లూ లేకుండా ఎందుకు విడిచిపెట్టారో మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది.


దీనిపై మరింత చదవండి :