పార్టీకి పూర్వ వైభవం తెస్తాం..! : సామివేలు

Ganesh|
రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తాము మరింతగా బలం పుంజుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు మలేసియన్ ఇండియన్ కాంగ్రెస్ (ఎమ్‌ఐసీ) అధ్యక్షుడు సామివేలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. మలేసియాలోనే అతిపెద్ద భారతీయ పార్టీ అయిన ఎమ్‌ఐసీ తన బ్రాంచ్ కార్యాలయాలను దాదాపుగా రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఉండే 3,600 కార్యాలయాలను ఆరు వేలకు పెంచనున్నట్లు సామివేలు వివరించారు. ఈ కొత్త కార్యాలయ పదవుల్లో యువత, మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు ఆయన తెలిపారు. భారతీయులు అధికంగా నివసిస్తున్న ప్రాంతంలో సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని సామివేలు చెప్పారు.

ఎమ్ఐసీ పార్టీలో గ్రాడ్యుయేట్ల సేవలను సైతం మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని కూడా తాము భావిస్తున్నట్లు సామివేలు పేర్కొన్నారు. తమ పార్టీలో చేరాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా... బ్లాగ్‌ల ద్వారా ఇతర సభ్యులకు, భారతీయులకు దగ్గరయ్యే ప్రయత్నాలను కూడా చేయాలని, ఫేస్‌బుక్‌ వాడకం ద్వారా ఒకరికొకరు సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని సామివేలు పార్టీ సభ్యులను ఈ సందర్భంగా కోరారు.


దీనిపై మరింత చదవండి :