పీఎఫ్ఎల్ ఆధ్వర్యంలో కిరణ్ బేడీతో ఎన్నారైల సదస్సు

Hanumantha Reddy|
PR
అమెరికాలో క్రీయాశీలకంగా పనిచేసే రాజకీయ సంస్థ పీపుల్ ఫర్ లోక్‌సత్తా(పీఎఫ్ఎల్) అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత మాజీ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడితో ప్రవాస భారతీయుల కోసం బహిరంగ సదస్సును ఏర్పాటు చేయనున్నది. ఈ సదస్సులో ఆమె భారత్‌లో అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమాలతో పాటు లోక్‌పాల్ బిల్లు గురించి తెలియజేయనున్నారు. లోక్‌పాల్ బిల్లు కోసం భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చల్లో తన అనుభవాల గురించి ఆమె వారికి వివరించనున్నారు.

డాక్టర్ కిరణ్ బేడి ఇండియా విజన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కూడా. ఈ సంస్థ పోలీసులు, ప్రజల మధ్య సహృద్భావ పరిస్థితులను కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో చేపట్టిన 'సేవ్ లీగల్ ఎయిడ్' ప్రాజెక్ట్‌కు సహకరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను 'ఇమిగ్రెంట్ డ్రీమ్' రచయిత అనూ పెషావారియా నిర్వహిస్తున్నారు.

భారత్‌లో అవినీతికి వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు చేపట్టిన 240 మైళ్ల దండి యాత్ర-2కు మద్దతు తెలిపిన కిరణ్ బేడిని పీఎఫ్ఎల్‌ న్యూజెర్సీ ఛాప్టర్‌కి చెందిన శ్రీనివాస్ రనబోతు కొనియాడారు. పీఎఫ్ఎల్ అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు, వ్యక్తులకు మద్దతు తెలుపుతూ వస్తున్నది. ఇటీవల అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, బాబా రామ్‌దేవ్‌లు చేపట్టిన నిరహార దీక్షకు మద్దతుగా అమెరికాలో దీక్ష చేపట్టింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను రద్దు చేయాలని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నది.

పీఎఫ్ఎల్ కిరణ్ బేడీని చికాగోలో కలసి అభినందించింది. అక్కడ ఐఏసీ, భారతస్వాభిమాన్, పీఎఫ్ఎల్‌లకు చెందిన పలువురు స్వచ్ఛంధ కార్యకర్తలు ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్‌లో అవినీతి నిర్మూలనకు కుల, మత, రాష్ట్ర, భాషా భేదాలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు. ఫేస్‌బుక్ ద్వారా చైతన్యం తీసుకురావడం వంటి చిన్న చిన్న చర్యల ద్వారా అవినీతిపై పోరాటంలో తమవంతు చేయూతనివ్వాలని బేడీ పిలుపునిచ్చారు.


దీనిపై మరింత చదవండి :