ప్రాణాంతక వ్యాధులు నయం చేస్తానన్నానా..? : బాబా రాందేవ్

Ganesh|
క్యాన్సర్, ఎయిడ్స్‌లాంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తానని, తానెప్పుడూ చెప్పలేదని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్పష్టం చేశారు. స్కాట్లాండ్‌లోని లిటిల్ కాంబ్రే ఐలాండ్‌లో యోగా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఆయన అంతర్జాతీయ విలేకరులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ప్రజల వ్యాధులను నయంచేసి, వారిని ఆరోగ్యవంతులుగా చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా చేసేందుకు 25 నుంచి 50 సంవత్సరాలు పడుతుందనీ, అంతవరకూ తాను స్థిరంగా అందుకోసం కృషి చేస్తానని అన్నారు.

అలాగే.. తన ద్వారా నేర్చుకున్న యోగాసనాల ద్వారా తమ వ్యాధులు నయమయ్యాయని ప్రజలు చెప్పినట్లయితే.. అది తన తప్పుగా అనటం ఎంతవరకు సబబు అని మీడియాను ఈ సందర్భంగా రాందేవ్ ప్రశ్నించారు. మీ యోగాసనాలతో క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థత కల్పిస్తారా..? అని విలేకరులు అడిగిన ప్రశ్నకుగానూ ఆయన పై విధంగా స్పందించారు.

అయితే ఆక్సిజన్ పుష్కళంగా ఉన్న వాతావరణంలో క్యాన్సర్ కణాలు మనుగడ సాగించలేవని రుజువయిందనీ, ఆరోగ్యకరమైన శ్వాస గురించే యోగా తెలియజెబుతుందని రాందేవ్ వివరించారు. కాగా... లిటిల్ కాంబ్రే ఐలాండ్‌ ఏకాంత దీవిలో పతంజలి యోగ్‌పీత్ (యూకే) ట్రస్టు ఓ నూతన యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే.. స్కాట్లాండ్‌లోని భారత సంతతికి చెందిన శ్యాం, సునీత పొద్దర్ అనే దంపతులు ఈ లిటిల్ కాంబ్రే ఐలాండ్‌ను కొనుగోలు చేసి పతంజలి యోగ్‌పీత్‌కు బహుమతిగా అందించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మిక అంశాలపై పరిశోధన సాగించేందుకుగానూ రాందేవ్ ఈ యోగ్‌పీత్ ట్రస్టును ఏర్పాటు చేయడం గమనార్హం.


దీనిపై మరింత చదవండి :