బాబీ జిందాల్‌కు పెరుగుతోన్న ఆదరణ

Ganesh|
ప్రవాస భారతీయుడు, లూసియానా రాష్ట్ర గవర్నర్ అయిన బాబీ జిందాల్‌కు క్రమక్రమంగా అమెరికాలో ఆదరణ పెరుగుతోంది. 2012వ సంవత్సరంలో జరుగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో జిందాల్‌ను నిలబెట్టేందుకు ఆయన మద్ధతుదారులు ఇప్పట్నించే సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... జిందాల్ కోసం నిధుల సేకరణకుగానూ వారు ఓ పొలిటికల్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

జిందాల్ కోసం 60 మిలియన్ డాలర్లను సేకరించటమే తమ పొలిటికల్ యాక్షన్ కమిటీ లక్ష్యమని ఈ సందర్భంగా జిందాల్ మద్ధతుదారులు ప్రకటించారు కూడా..! "జిందాల్ ఫర్ ప్రెసిడెంట్ డ్రాఫ్ట్ కౌన్సిల్ ఐఎన్‌సీ" అనే పేరుతో లూసియానా రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసినట్లు ఆ సంస్థ లాయర్ వివరాలను అందించినట్లుగా స్థానిక పత్రిక ఒకటి పేర్కొంది.

అయితే దీనిపై జిందాల్ ప్రచార కార్యదర్శి కైలీ ప్లాటికిన్ మాత్రం ఆచితూచి స్పందిస్తూ... ఈ సంస్థతో జిందాల్‌కు ఎలాంటి సంబంధమూ లేదని, ఇలాంటి చర్యలను ఆయన సమర్థించబోరని స్పష్టం చేశారు. సదరన్ యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్ రామా మహంతి, రిపబ్లికన్ పార్టీ లూసియానా శాఖ కోశాధికారి డాన్ కైల్, జిందాల్ భార్య సుప్రియ మామయ్య రామ్ భటియా తదితరులు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు "టైమ్స్ పికాగాన్" పత్రిక వెల్లడించటం గమనార్హం.

అంతేగాకుండా.. జిందాల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ కమిటీ తరపున 150 మంది సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... 38 సంవత్సరాల బాబీ జిందాల్ 2012 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరాక్ ఒబామాకు గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష రేసులో తాను లేనని, లూసియానాపై దృష్టి పెట్టడమే తన కర్తవ్యమని, జిందాల్ పలుమార్లు స్పష్టం చేశారు.


దీనిపై మరింత చదవండి :