భారతీయులపై దాడులేమీ కొత్తకాదు: ఓవర్లాండ్

Racial Attacks
Ganesh|
FILE
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడులేమీ కొత్తకాదని ఆస్ట్రేలియాలోని విక్టోరియా చీఫ్ పోలీస్ కమీషనర్ సిమన్ ఓవర్లాండ్ పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్రితమే తాము ఈ విషయాన్ని గుర్తించినట్లు ఆయన ఎంచక్కా సెలవిచ్చారు.

భారతీయులు ఎక్కువగా దొంగతనాలకు లక్ష్యంగా మారుతున్నారనీ, ఏవో కొన్ని దాడులు మాత్రమే జాత్యహంకార ప్రేరణతో జరిగాయని ఓవర్లాండ్ చెప్పినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా సిమన్ మాట్లాడుతూ.. ఈ దాడుల నివారణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

అదే విధంగా భారతీయులపై దాడులకు పాల్పడుతున్నవారి పూర్తి సమాచారాన్ని సేకరించామనీ, సగంమందికి పైగా బాధితులు వారు పనిచేస్తున్న చోటనే దాడులకు గురయినట్లు తాము గుర్తించామని ఓవర్లాండ్ ఈ మేరకు వివరించారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం, అధికారులు, పోలీసు అధికారులు.. దాడుల నివారణ గురించి ఎంతగా చెప్పినా, ఆ దేశంలో భారతీయులపై జరుగుతున్న దాడులు మాత్రం ఆగటం లేదు. తాజాగా ఇద్దరు భారతీయ డ్రైవర్లపై జరిగిన దాడులు, అలాగే బుధవారంలో వెలుగుచూసిన భారతీయ క్యాబ్ డ్రైవర్‌పై దాడి ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.


దీనిపై మరింత చదవండి :