భారతీయ విద్యా భవన్ సేవలు అమోఘం : నళిన్ సూరి

Dance
Ganesh|
FILE
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయ విలువలపై అవగాహన కల్పిస్తూ, లండన్‌లోని భారతీయ విద్యా భవన్ (బీవీబీ), బ్రిటన్ వ్యాప్తంగా చేస్తున్న సేవలు అమోఘమని.. ఆ దేశంలోని భారత హై కమీషనర్ నళిన్ సూరి కొనియాడారు. భారత సంస్కృతి, జాతి, గాంధేయ సిద్ధాంతాలను యూకేలో వ్యాప్తి చేసే లక్ష్యంతో బీవీబీ చేస్తున్న కృషి ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతించారు.

దీపావళి ఉత్సవాల్లో భాగంగా బీవీబీ లండన్‌లోని మిలీనియమ్ మేఫెయిర్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నళిన్ సూరి పాల్గొని, ప్రసంగించారు. భారత సంప్రదాయ కళలను బ్రిటన్‌లో వ్యాప్తి చేసేందుకు బీవీబీ అకుంఠిత దీక్షతో కృషి చేస్తోందని ఆయన ప్రశంసించారు. అదే విధంగా భారత్-యూకేల మధ్య దృఢమైన సంబంధాలు ఏర్పడేందుకు ప్రవాస భారతీయుల పాత్ర మరువరానిదన్నారు.

అనంతరం విద్యాభవన్ ఛైర్మన్ మాట్లాడుతూ... ప్రస్తుతం తమ కళాశాలలో 900 మంది విద్యార్థులున్నారనీ, ఈ ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే భారత సంగీతం డిగ్రీ కోర్సు నాలుగో ఏడాదికి చేరుకుందనీ, ఇది తనకు ఎంతో సంతృప్తిగా ఉందని వైస్ ఛైర్మన్ జోగిందర్ సంగేర్ పేర్కొన్నారు. బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక విద్యా కేంద్రాల సహకారంతోనే ఈ ఘనతను సాధించామని ఆయన వినమ్రంగా ప్రకటించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో బ్రిటన్ ప్రవాస భారతీయ ప్రముఖులు.. లార్డ్ స్వరాజ్ పాల్, లార్డ్ భీకూ పరేఖ్, లార్డ్ నవనీత్ దౌలాకియా, లార్డ్ హమీద్, హిందూజా గ్రూఫ్ చైర్మన్, అధ్యక్షులు ఎస్పీ హిందూజా, జీపీ హిందూజా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. భారతీయ సంస్కృతి, కళలపై బీవీపీ చేస్తున్న ప్రచారానికి అమోఘ స్పందన లభిస్తోంది. స్వదేశీ సంస్కృతి, కళలపై అవగాహన ఏర్పర్చుకునేందుకు వయోభేదం లేకుండా ఎన్నారై పిల్లలు, పెద్దలు ఉత్సాహం ప్రదర్శిస్తుండటం మరింత విశేషంగా చెప్పవచ్చు.


దీనిపై మరింత చదవండి :