భారత్‌లో పని అనుభవానికై బ్రిటన్ విద్యార్థుల ఆసక్తి

Ganesh|
FILE
బిజినెస్, ఫైనాన్స్ సంబంధిత కోర్సులు పూర్తి చేసిన బ్రిటన్ విద్యార్థు.. లు భారత్ కంపెనీలలో పని అనుభవం సంపాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారని బ్రిటన్-భారత్ వాణిజ్యమండలి (యూకేఐబీసీ) వెల్లడించింది. ఈ సంవత్సరం యూకేఐబీసీ స్కాలర్‌షిప్ గెల్చుకున్న వివిధ యూనివర్సిటీలకు చెందిన యువకులు భారత కంపెనీలతో అనుబంధాన్ని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు యూకేఐబీసీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ... భారత్‌లో పనిచేసేందుకు బ్రిటీష్ విద్యార్థులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నట్లుగా తాము గుర్తించామన్నారు. భారతీయ కంపెనీలలో ఉద్యోగ జీవితం ప్రారంభించాలని వారు కోరుకుంటున్నారనీ, ఇక్కడి పనివాతావరణం వారి కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడే విధంగా ఉంటుందని వారు భావిస్తున్నారని తెలిపారు.

ఇదిలా ఉంటే, యూకేఐబీసీ సీఈఓ షరాన్ బామ్‌ఫోర్డ్ మాట్లాడుతూ... యూకేఐబీసీ స్కాలర్‌షిప్‌కు 10 మంది విద్యార్థులు ఎంపికయినట్లు తెలిపారు. ఎమర్జింగ్ మార్కెట్‌లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ పొందేందుకు, సమర్థులైన ఉద్యోగులుగా నిలదొక్కుకునేందుకు ఈ ఉపకార వేతనం అవకాశం కల్పిస్తుందని షరాన్ పేర్కొన్నారు.

ఆధునిక భారతదేశం గురించి కొత్త తరానికి తెలియజెప్పేందుకు, వర్తక, వాణిజ్య, పెట్టుబడుల రంగంలో ఇరు దేశాల నడుమ సంబంధాలను పటిష్టం చేసేందుకు విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నట్లు షరాన్ తెలియజేశారు. బ్రిటీష్ హై కమీషనర్ సర్ రిచర్డ్ స్టాగ్ కూడా దీనికి మద్ధతు ఇచ్చారని, ఇరు దేశాల మధ్య విద్యార్థుల రాకపోకలు, శిక్షణా కార్యక్రమాలు మరింతగా పెరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు షరాన్ బామ్‌ఫోర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


దీనిపై మరింత చదవండి :