భారత విద్యార్థిపై దాడి చేసిన ఆస్ట్రేలియన్‌కు జైలు

Sankellu
Ganesh|
FILE
గత సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ఒక భారతీయ విద్యార్థిపై జాత్యహంకార దాడి చేసిన ఓ ఆస్ట్రేలియన్ యువకుడికి స్థానిక కౌంటీ కోర్టు జైలుశిక్షను విధించింది. నిందితుడు నాలుగన్నర సంవత్సరాల శిక్షాకాలంలో.. కనీసం రెండు సంవత్సరాలపాటు నాన్ పెరోల్ పీరియడ్‌ను గడపాల్సిందిగా న్యాయమూర్తి పమేలా జంకిన్స్ ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. గత యేడాది డిసెంబర్ ఒకటవ తేదీన ఏడుగురు సభ్యులుగల ఆస్ట్రేలియన్ యువకుల బృందం... సుఖ్‌రాజ్ సింగ్ అనే 28 సంవత్సరాల భారతీయ విద్యార్థిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. నువ్వు భారతీయుడివా అని ప్రశ్నించి మరీ వీరు దాడికి పాల్పడటమేగాక, జాత్యహంకార వ్యాఖ్యలతో దూషించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సింగ్ 15 రోజులపాటు కోమాలోకి వెళ్లిపోయినట్లుగా "ది ఏజ్" పత్రిక పేర్కొంది.

ఈ ఘటనలో సుఖ్‌రాజ్‌తో పాటు ఎనిమిది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియన్ యువకుల దాడికి గురయ్యారు. వీరంతా చిన్నపాటి గాయాలతో బతికి బయటపడగా.. సుఖ్‌రాజ్ మాత్రం తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి నెట్టబడ్డాడు. కొన్ని నెలలపాటు ఆసుపత్రికే అంకితమైన ఇతను ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి పమేలా జంకిన్స్.. ఆస్ట్రేలియన్ యువకుల బృందం ప్రవాస భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జాత్యహంకార దాడికి పాల్పడినట్లుగా రుజువైందన్నారు. ఈ దాడిలో ముఖ్యపాత్ర పోషించిన జకారే హుస్సేన్ అనే 21 సంవత్సరాల యువకుడికి నాలుగు సంవత్సరాల జైలుశిక్షను విధిస్తున్నట్లు తీర్పునిచ్చారు. ఈ శిక్షాకాలంలో ఇతను కనీసం రెండు సంవత్సరాలపాటు నాన్ పెరోల్ దశను అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి ఆదేశించారు.

కాగా... ఓ పార్కులు ఫూటుగా మద్యం సేవించిన ఆస్ట్రేలియన్ యువకులు నాలుగు గంటల తరువాత సిటీ ప్లేస్‌లోని ఓ షాపుకు వెళ్ళారు. అక్కడ ఇద్దరు యువకులు షాపులోని మరో ఇద్దరు కస్టమర్లతో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఏజ్ కథనం ప్రకారం.. కస్టమర్లతో వాగ్వివాదం అనంతరం బయటికి వెళ్లిన ఆస్ట్రేలియన్లు వారి మిత్రబృందంతో కలిసి కర్రలతో వచ్చి దాడికి పాల్పడ్డారని.. దాటి సమయంలో "ఆర్ యూ ఇండియన్.. బ్లడీ ఇండియన్స్" అంటూ చెలరేగిపోయనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. దాడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సుఖ్‌రాజ్‌ మాట్లాడుతూ.. తన ముఖంలో మెటల్ ప్లేటులను అమర్చినట్లు తెలిపాడు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులంతా తాను చనిపోయేవాడినని చెప్పారని.. అయితే తాను అదృష్టవంతుడిని కాబట్టి ప్రాణాలతో మిగలగలిగానని అన్నాడు. తనను ఈ పరిస్థితికి గురి చేసిన నిందితులకు శిక్ష పడటం సరైనదేనని అతను సంతోషం వ్యక్తం చేశాడు.


దీనిపై మరింత చదవండి :