మన్మోహన్ అమెరికా పర్యటన : మార్కస్ విందు పసందు...!!

Manmohan Singh
Ganesh|
FILE
భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నవంబర్ 24వ తేదీన అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇచ్చే ఆతిథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు అమెరికా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. విందు వంటకాలను పసందుగా అందించేందుకు వంటల్లో ఆరితేరిన, ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న ఆఫ్రికన్ అమెరికన్ చెఫ్ మార్కస్ సామ్యూల్‌సన్‌ను ఎంపిక చేసింది.

వైట్‌హౌస్ చీఫ్ చెఫ్ క్రీస్టేటా కోమర్‌ఫోర్డ్‌తో కలిసి మార్కస్ మన్మోహన్‌కు ఇవ్వబోయే విందు వంటకాలను సిద్ధం చేయనున్నారు. ఈ విందుకోసం ఈ ఏడాది వేసవి కాలంలోనే ప్రయత్నాలు మొదలయ్యాయని "పొలిటికో" ఒక కథనాన్ని ప్రచురించటం విశేషం. వైట్‌హౌస్ అసిస్టెంట్ చెఫ్ సామ్ కాస్ పలు హోటళ్ల నుంచి వంటకాలు తెప్పించి, రుచి చూశారనీ.. అప్పుడప్పుడు మంత్రి డిసిరీ రోజర్స్ కూడా అందులో పాలు పంచుకున్నారని పై కథనం వివరించింది.

చివరకు ఇథియోపియాలో జన్మించి, స్వీడన్ దంపతులకు దత్తత వెళ్లిన మార్కస్ సామ్యూల్‌సన్‌ను ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే... నవంబర్ 24న అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధానికి అధ్యక్ష భవనమైన శ్వేత సౌధంలో ఘనంగా విందు ఇవ్వనున్నారు. ఈ విందు కార్యక్రమానికి ఆహ్వానితులుగా పలువురు అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలు, ప్రవాస భారతీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.


దీనిపై మరింత చదవండి :