మళ్లీ తెరపైకి పశుపతినాథ్ పూజారుల వివాదం

Ganesh|
నేపాల్‌లోని పశుపతినాథ దేవాలయానికి వివాదాల బెడద తప్పేటట్లుగా కనిపించటం లేదు. తాజాగా ఈ ఆలయంలో దక్షిణ భారత పూజారులను నియమించాలని నిర్ణయం తీసుకున్న ఆలయ నిర్వాహకులు మరో వివాదానికి తెరతీశారు. కాగా... ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి తీరుతామని మావోయిస్టులు వెంటనే హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే... పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ ట్రస్ట్ (పీఏడీటీ) దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు పూజారుల పేర్లను సూచించటం కోసం, ప్రధాన అర్చకుడు మహాబలీశ్వర్ భట్టా నేతృత్వంలో ముగ్గురితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పశుపతినాథ దేవాలయ ప్రాంగణంలోనే ఉన్న వాసుకి దేవాలయానికి ప్రస్తుతం అర్చకులు లేనందున తక్షణమే ఈ నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని ఈ మేరకు పీఏడీటీ వెల్లడించింది.

మూడు వందల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అనుసరించి, దక్షిణ భారత బ్రాహ్మణ పూజారులను నియమించేందుకు శ్రీకారం చుట్టామని పీఏడీటీ సమర్థించుకుంది. కాగా.. గతంలో మావోయిస్టుల నేతృత్వంలోని ప్రభుత్వం, భారత పూజారులను నియమించే సంప్రదాయానికి స్వస్తి పలకాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న సంగతి పాఠకులకు విదితమే...!


దీనిపై మరింత చదవండి :