యూఏఈ లేబర్ క్యాంపుల్లో మగ్గుతున్న భారతీయులు..!!

Nri News
Ganesh|
FILE
యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లేబర్ క్యాంపులలో 800 మందికిపైగా భారతీయ వర్కర్లు మగ్గిపోతున్నట్లు "ది నేషనల్" దినపత్రిక ఓ కథనంలో వెల్లడించింది. లేబర్ క్యాంపులలో ఉన్న భారతీయులకు విద్యుత్ సరఫరాను, నీటి సరఫరాను నిలిపివేసి అనేక యాతనలకు గురిచేస్తున్నారనీ, దీంతో తమను భారత్‌లో వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నట్లు ఆ పత్రిక తెలిపింది.

"అట్లాంటిక్ ఎమిరేట్స్ గ్రూప్" అనే దుబాయ్ కేంద్రంగా నడిచే వ్యాపార సంస్థలో పనిచేసే భారతీయ వర్కర్లు షార్జాలోని లేబర్ క్యాంపులలో జీవిస్తున్నారు. వీరికి గత ఆరు నెలలుగా వేతనాలను అందించనీ ఈ సంస్థ, లేబర్ క్యాంపులకు విద్యుత్, నీటి సరఫరాలను సైతం లేకుండా చేసిందని ది నేషనల్ తన కథనంలో వివరించింది.

అట్లాంటిక్ ఎమిరేట్స్ గ్రూప్ సంస్థలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ సునీల్ చల్లీల్ ది నేషనల్ పత్రికతో మాట్లాడుతూ.. ఈ సంస్థ గత రెండు నెలల కాలంగా తమకు జీతాలను ఇవ్వటంలేదని వాపోయాడు. దీంతో వేతనాల కోసం ఎదురుచూస్తున్నామనీ.. పనిని కూడా పూర్తిగా నిలిపివేశామని చెప్పాడు. అయితే భవిష్యత్తును తలచుకుంటే చాలా ఆందోళనగా ఉందని సునీల్ వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే.. అట్లాంటిక్ ఎమిరేట్స్ గ్రూప్ అబుదాబి, దుబాయ్ మరియు షార్జాలలో అనేక సంస్థలను కలిగి ఉంది. ఈ సంస్థ రియల్ ఎస్టేట్ మేనజ్‌మెంట్, కనస్ట్రక్షన్, ఇంజనీరింగ్, సెక్యూరిటీస్ మరియు క్లీనింగ్ సర్వీసెస్.. తదితర విభాగాలలో పనిచేస్తోంది. వీటిల్లో పనిచేసేందుకు భారత్‌ నుంచి వర్కర్లకు ప్రవేశం కల్పించిన ఈ సంస్థ.. ప్రస్తుతం వర్కర్లకు సకాలంలో వేతనం ఇవ్వకుండా, వారు నివసించే క్యాంపులలో సైతం విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేసి పలు ఇక్కట్లకు గురిచేస్తోందని నేషనల్ పత్రిక వివరించింది.


దీనిపై మరింత చదవండి :